కుటుంబ సమస్యల నుంచి తప్పించుకునేందుకే..

9 Apr, 2022 02:46 IST|Sakshi

గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వ విభేదాలు 

సీఎంను చేయాలని కేసీఆర్‌పై కేటీఆర్‌ ఒత్తిడి తెస్తున్నారు 

గవర్నర్‌తో సఖ్యత లేనందున కష్టమని కేసీఆర్‌ చెబుతున్నారు 

సమస్యలను గుర్తించిన గవర్నర్‌ విచక్షణాధికారాలతో పరిష్కరించలేరా? 

ఉగాది వేడుకలకు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు ఎందుకు రాలేదో కూడా చెప్పాల్సింది 

మీడియాతో చిట్‌చాట్‌లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: తన కుటుంబ సమస్యల నుంచి తప్పించుకునేందుకే రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌తో విభేదాలున్నట్టు సీఎం కేసీఆర్‌ చిత్రీకరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘తనను సీఎంను చేయాలని కేటీఆర్‌ తన తండ్రి కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్నారు. గవర్నర్‌తో సఖ్యత లేనప్పుడు కేటీఆర్‌ను సీఎం చేయడం కష్టమవుతుందని కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. గవర్నర్‌ను సాకుగా చూపి కేసీఆర్‌ కుటుంబ సమస్యల నుంచి తప్పించుకుంటున్నారు’ అని గాంధీభవన్‌లో శుక్రవారం మీడియాతో చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు.

గవర్నర్‌ ఢిల్లీ పర్యటన ద్వారా అనేక అంశాలు తెరపైకి వచ్చాయని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన చట్టం ద్వారా గరవ్నర్‌కు చాలా అధికారాలున్నాయని, రాష్ట్రంలో ఉన్న సమస్యలను గుర్తించిన గవర్నర్‌కు ఆ చట్టంలోని సెక్షన్‌–8 ద్వారా పరిష్కరించే అధికారం కూడా ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్కలు, పిల్లులు, ఎలుకలు పెత్తనం చేస్తున్నాయని, యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో విద్య, వైద్యం, శాంతిభద్రతల సమస్యలపై సమీక్ష చేసి గవర్నర్‌ చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. గవర్నర్‌ తక్షణమే తన అధికారాలను ఉపయోగించుకోవాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.  

అప్పుడు తెలియదా? 
‘గవర్నర్‌ బీజేపీ నాయకురాలిగా మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు ఓట్లు వేసేటప్పుడు వాళ్లు బీజేపీ వారని టీఆర్‌ఎస్‌ నేతలకు తెలియదా’అని రేవంత్‌ ప్రశ్నించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలకు సీఎం, మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు హాజరు కాకపోవడం ఒక ఎత్తయితే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లు ఎందుకు హాజరు కాలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు జరిగిన రోజు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉండి కూడా వెళ్లలేదని, సీఎం కేసీఆర్‌కు కోపం వస్తుందనే ఆ ఇద్దరు రాలేదన్నారు. తాను పిలిస్తే కిషన్‌రెడ్డి, సంజయ్‌లు కూడా రాలేదని కేంద్రానికి చేసిన ఫిర్యాదులో గవర్నర్‌ ప్రస్తావించి ఉంటే బాగుండేదని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు