ఆదరణ ఉంటే సందుల్లో సభలేల?

6 Jan, 2023 14:33 IST|Sakshi

బాబుకు నిజంగానే ప్రజాబలం ఉంటే మైదానంలో సభ పెట్టాలి: సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రజల ప్రాణాలను కాపాడేందుకే జీవో 1 జారీ

రహదారులపై సభలను మాత్రమే నిషేధించాం

పోలీసుల సూచనల మేరకే సీఎం జగన్‌ మీటింగులు

ప్రభుత్వ అవసరాన్ని బట్టే సలహాదారుల నియామకం

కన్సల్టెంట్ల పేరుతో గత సర్కారు రూ.వందల కోట్ల దోపిడీ

సాక్షి, అమరావతి: ‘ప్రజల ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత. ప్రజలకు ఇబ్బంది కలిగేలా రోడ్లపై సభలు సరికాదు’ అని రాష్ట్ర ప్రభుత్వ సల­హాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పోలీస్‌ యాక్ట్‌కు లోబడి, ప్రజల ప్రాణాలను పరిరక్షించే బాధ్యతలో భాగంగానే ప్రభుత్వం జీవో 1 జారీ చేసిందన్నారు. ఇది రాష్ట్రంలో అన్ని పార్టీలకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు. కందుకూరు, గుంటూరులో చోటు చేసుకున్న విషా­దాలకు బాధ్యత వహించాల్సిన టీడీపీ అధ్య­క్షుడు చంద్రబాబు వారం రోజులుగా డ్రామాలు చేస్తు­న్నా­రని మండిపడ్డారు. చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తి­స్తు­న్నారని, ఆయనకు కనీస సంస్కారం లేదని మండిపడ్డారు. ఆయన సభలకు పోలీసులు ఎక్కడా అడ్డుకోలేదని, నిబంధనలు పాటించాలని 

మాత్రమే సూచించారన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...
ట    చంద్రబాబుకు నిజంగానే ప్రజాబలం ఉంటే, ఆయన సభలకు ప్రజలు వస్తారన్న నమ్మకం  ఉంటే మైదానాల్లో ఎందుకు నిర్వహించడం లేదు? రహదారులపై బహిరంగ సభలను మాత్రమే జీవోలో నిషేధించాం. ర్యాలీలను నిషేధించలేదే? జీవోపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాలకు వెళ్లొచ్చు. అమరావతి నుంచి ప్రతి అంశంలోనూ చంద్రబాబు ఒక వర్చువల్‌ ప్రపంచంలో బతుకుతున్నారు. 

కుప్పంలో మూడు రోజులుగా చంద్రబాబు రోడ్‌ షో చేస్తూనే ఉన్నారు. క్రేన్లతో ఆయనకు దండలు కూడా వేస్తూనే ఉన్నారు. ఇక మేం అడ్డుకున్నదేముంది? చంద్రబాబుకు జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కూడా ఉంది. ఆ కోణంలో చూసినా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలి కదా! గుంటూరులో పోలీసులు తక్షణమే స్పందించడం వల్లే మరణాలు తగ్గాయి. 
పోలీసుల సూచనల మేరకే సీఎం జగన్‌ మీటింగులు జరుగుతున్నాయి. ఇటీవల కర్నూలు రాజ్‌ విహార్‌ సెంటర్‌లో నిర్వహించాలనే ప్రతిపాదన వస్తే ఇరుకు రోడ్డులో వద్దని మేమే చెప్పాం. సీఎం పర్యటనలకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇస్తున్నాం. వారి సూచనల ప్రకారం కొన్ని సందర్భాల్లో సభల స్థలాలను కూడా మార్చుకున్నాం. 

ఇండిపెండెంట్‌ వ్యవస్థ...
సలహాదారుల నియామకానికి సంబంధించి కోర్టు ఏం చెప్పిందో నాకు తెలియదు కానీ నిప్పులు చెరిగిందంటూ కొన్ని పత్రికలు నోటికొచ్చినట్లు ప్రచురించిన కథనాలపై స్పందించలేం. అలాంటి వ్యాఖ్యలు చేసిందని మేం భావించడం లేదు. న్యాయ వ్యవస్థ.. ఎగ్జిక్యూటివ్‌ వ్యవస్థపై బాస్‌ కాదు. కార్య నిర్వాహక వ్యవస్థ ఇండిపెండెంట్‌ వ్యవస్థ.  ఇందులో ఈ మధ్య కాలంలో సంక్లిష్టత పెరిగింది. దానికి అనుగుణంగా నిపుణుల అవసరం కూడా ఉంటుంది. అధికారంలో ఉండే పార్టీ విధానాలు ప్రజల్లోకి సమర్ధంగా వెళ్లేందుకు సలహాదారులను నియమించవచ్చు. మా ప్రభుత్వ అవసరాన్ని బట్టి సలహాదారులను నియమిస్తున్నాం. కేంద్రంలో కూడా ఉన్నారు. చంద్రబాబు హయాంలో కూడా నియమించుకున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా కన్సల్టెంట్‌ పేరుతో రూ.వందల కోట్లు దోచేశారు. 

ప్రభుత్వం ఎవరికీ  సబార్డినేట్‌ కాదు..
సలహాదారులు ఉండాలా లేదా? దాని రాజ్యాంగ బద్ధత ఏమిటి? అని పరిశీలించే హక్కు న్యాయ వ్యవస్థకు ఎప్పుడూ ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వం ఎవరికీ సబార్డినేట్‌ కాదు. ప్రభుత్వం జవాబు ఇవ్వాలంటే శాసన వ్యవస్థకు ఇవ్వాలి. ఒకవేళ నియమాలకు విరుద్ధంగా చేస్తే కోర్టులు ప్రశ్నిస్తాయి. ఒక వ్యవస్థ అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుని ఉంటుందని పరస్పర నమ్మకంతో వ్యవస్థల మధ్య సంబంధాలు ఉండాలి. అలాకాకుండా నేనేదైనా కామెంట్‌ చేయవచ్చని ఎవరైనా అంటే నష్టం జరుగుతుంది. రాజ్యాంగం ఆశించిన సమన్వయం దెబ్బతింటుంది. 
 

చదవండి: కుప్పం, చంద్రబాబుపై మంత్రి అంబటి ఆసక్తికర కామెంట్స్‌

మరిన్ని వార్తలు