కోర్టులను ప్రభావితం చేసేలా ఓ వర్గం మీడియా కథనాలు

22 Sep, 2020 04:21 IST|Sakshi

రాజధాని రైతుల పుండు మీద కారం చల్లే విధంగా రాతలు

అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

సాక్షి, అమరావతి: రాజధాని అంశంపై హైకోర్టులో వాయిదా వచ్చినప్పుడల్లా ఎప్పటిలాగే ఆ రెండు పత్రికలు (ఈనాడు, ఆంధ్రజ్యోతి), రెండు టీవీ చానల్స్‌ (ఈటీవీ, ఏబీఎన్‌) హడావుడి చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు రంగుల కల లాంటి, ఒక పీడకలను బ్యానర్‌ స్టోరీలుగా ఆవిష్కరిస్తున్నాయని మండిపడ్డారు. ఇది అనైతికం, చట్ట వ్యతిరేకమన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

► గతంలో శంకర్రావు, అచ్చెన్నాయుడు తదితర నేతలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించినప్పుడు కోర్టులను ప్రభావితం చేసేలా కథనాలు వండివార్చిన సంగతి ప్రజలెవ్వరూ మరచి పోలేదు.
► టీడీపీ బినామీలు, రియల్‌ ఎస్టేట్‌ వాళ్లు హైకోర్టు వద్ద మోకాళ్ల మీద నిల్చోవడం, ప్రదర్శనలు చేయటం న్యాయమూర్తులను ప్రభావితం చేయటం కాదా?
► బాబు చేతిలో మోసపోయిన రాజధాని రైతుల పుండు మీద కారం చల్లే విధంగా ఎల్లో మీడియా రాతలున్నాయి. మళ్లీ నవ నగరాలు, ఆకాశ హార్మ్యాలు.. అంటే జనం వెంటపడి కొడతారు. అన్నీ అమరావతిలోనే అన్నందుకే చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపించారు.  
► రాజధానిని మేము మార్చడం లేదు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం పరిపాలనను వికేంద్రీకరిస్తున్నాం.  
► నిజమైన సెక్యులర్‌ సీఎం వైఎస్‌ జగన్‌. చంద్రబాబు పూజలు చేసేటప్పుడు కాలికి బూట్లు కూడా వదలరు. బాబుకు అసలు దేవుడు అంటే భక్తి ఉందా అని ప్రశ్నించాలి. కానీ అంత చీప్‌ రాజకీయాలు మేం చేయం. 

>
మరిన్ని వార్తలు