బొంకులు అంతకు మించే

22 Jul, 2022 04:06 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ

రాష్ట్రంలో శ్రీలంక పరిస్థితులంటూ దుష్ట చతుష్టయం దుష్ప్రచారం 

అచ్చోసిన అబద్ధాలతో ఈనాడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు బృందం బురద చల్లుడు 

రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చడం, సంక్షేమాన్ని అడ్డుకోవడమే లక్ష్యం.. ఒకదేశాన్ని రాష్ట్రంతో పోలుస్తూ అసంబద్ధ కథనాలు 

ఎలా చూసినా టీడీపీ హయాంలోనే విచ్చలవిడిగా అప్పులు  

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి,ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ధ్వజం 

సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై దుష్ట చతుష్టయం దుష్ప్రచారానికి పాల్పడుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ఈనాడుతో పాటు చంద్రబాబు బృందం ఊహాజనిత లెక్కలతో రాష్ట్రంలో శ్రీలంక పరిస్థితులంటూ లేని అప్పులను కూడా జత చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో తమకు పుట్టగతులుండవని గ్రహించి రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు శ్రీలంకకు, మన రాష్ట్రానికి పోలికే ఉండదన్నారు. ఈ వాస్తవాలు తెలిసి కూడా సంక్షేమం ఆగిపోవాలని, అప్పులు పుట్టకూడదనే దురుద్దేశంతో ఈనాడు ప్రచురిస్తున్న కథనాలను చంద్రబాబు బృందం వల్లె వేస్తోందన్నారు. గురువారం సచివాలయంలో సజ్జల, దువ్వూరి  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలివీ..

ఈనాడు కాకి లెక్కలు..
సీఎం జగన్‌ చెప్పిన వాటితోపాటు చెప్పని హామీలను కూడా అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శవంతమైన పాలనతో ప్రజల విశ్వాసాన్ని పెంచుకోవడంతో దిక్కుతోచక ఈనాడు, బాబు గ్యాంగ్‌ అప్పులపై తరచూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సజ్జల విమర్శించారు. ‘రాష్ట్రానికి దాదాపు రూ.8.5 లక్షల కోట్ల అప్పు ఉందని రాశారు. ఇంకా నయం.. ఏ రూ.20 లక్షల కోట్ల అప్పు ఉందనో రాయలేదు. ఈనాడు బాధ్యతా రాహిత్యానికి ఇది పరాకాష్ట’ అని పేర్కొన్నారు.

‘ఎన్టీ రామారావు అధికారంలోకి రావడానికి, ఆ తర్వాత చంద్రబాబుకు సీఎం పదవి దక్కడానికి తానే కారణం, రాజకీయంగా శాసించగలనని భావించే రామోజీరావు ఈరోజుకూ అదే పరిస్థితి ఉందనే భ్రమల్లో ఉన్నారు. రోజూ రాసిందే రాస్తున్నారు. అది తీసుకుని చంద్రబాబు, ఆయన బృందం మాట్లాడుతుంటే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు. జవాబుదారీతనం లేకుండా కాకి లెక్కలతో కథనాలు అచ్చు వేస్తున్నారు’ అని మండిపడ్డారు. అప్పులు పుట్టకూడదని, సంక్షేమం – అభివృద్ధి పథకాలు ఆగిపోవాలనే దురుద్దేశంతో ఉన్నారని దుయ్యబట్టారు. ఈనాడుతో పాటు బాబు గ్యాంగ్‌ సంక్షేమానికి వ్యతిరేకమని, పేదలు ఆర్థికంగా ఎదగడం వారికి నచ్చదని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్రానికి, పేదలకు నష్టం చేయాలనే కుట్రలో భాగంగానే అప్పులపై తప్పుడు లెక్కలతో కథనాలు ప్రచురిస్తున్నారని చెప్పారు. సీఎం కుర్చీ నుంచి జగన్‌ని దించేసి బాబును కూర్చోబెట్టి దోచుకుని పంచుకోవాలనే ఆరాటం ఈనాడు రాతలు, దుష్టచుతుష్టయంలో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

వారి గొయ్యి వారే..
ప్రభుత్వంపై బురద జల్లాలనే టీడీపీ ఎంపీ పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చిన జవాబుతో వారి గొయ్యి వారే తవ్వుకున్నట్లయిందని చెప్పారు. కోవిడ్‌తో ఆదాయం తగ్గి వ్యయం బాగా పెరిగినప్పటికీ సీఎం జగన్‌ సంక్షేమ పథకాలను నిరాటంకంగా అమలు చేస్తూ రూ.1.65 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారన్నారు. కోవిడ్‌ లేకపోతే మరింత మెరుగ్గా పరిస్థితులుండేవన్నారు. పోలవరంలో గోదావరి వరదను మళ్లించడానికి స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌ నిర్మించకుండా డయాఫ్రమ్‌ వాల్‌ ఎవరైనా కడతారా? అని ప్రశ్నించారు. బాబు నిర్వాకం వల్లే పోలవరంలో ఈ పరిస్థితులు తలెత్తాయన్నారు. గతంలో కన్నా మెరుగ్గా వరద బాధితులకు సాయమందిస్తోందన్నారు.

వరద ప్రాంతాల్లో విజయ సంకేతాలా?
చంద్రబాబు వరదపీడిత ప్రాంతాల్లో పరామర్శ పేరుతో రోడ్‌షో చేస్తున్నారని సజ్జల విమర్శించారు. తాను అధికారంలో ఉంటే తుపాన్‌ కంటే ముందుగా వచ్చే వాడినన్న చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘అంత వయసు వచ్చింది.. ఎక్కడికి వెళ్లామనే కనీస స్పృహ కూడా లేకుండా వరదపీడిత ప్రాంతాల్లో విజయ సంకేతాలు చూపుతూ రోడ్‌షో చేస్తున్నారు. బొకేలు స్వీకరిస్తున్నారు’ అని దుయ్యబట్టారు.

శ్రీలంకతో పోల్చడం అవివేకం: దువ్వూరి కృష్ణ
శ్రీలంక అప్పులతో రాష్ట్రాన్ని పోల్చడం అవివేకానికి నిదర్శనమని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ పేర్కొన్నారు. దేశానికి ఉండే ద్రవ్య బాధ్యతలకు రాష్ట్రాలకు ఉండే ద్రవ్య బాధ్యతలకు తేడా తెలుసుకోకుండా కధనాలు రాయడం ఏమిటని ప్రశ్నించారు. బడ్జెట్‌ డాక్యుమెంట్లతో పాటు కాగ్‌ నివేదికల్లో అప్పులపై వాస్తవ గణాంకాలున్నప్పటికీ దురుద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చాలనే కుట్రతోనే అవాస్తవ లెక్కలతో కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. కోవిడ్‌ కారణంగా దేశంతో పాటు ప్రపంచమంతా ఆదాయం తగ్గిపోయి అప్పులు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయని, అయినప్పటికీ పరిమితికి లోబడే రాష్ట్రం అప్పులు ఉన్నాయన్నారు. 

ఇప్పుడు ఎంతో మెరుగ్గా..
టీడీపీ హయాంలో ఐదేళ్లలో జీఎస్‌డీపీలో అప్పులు మూడు శాతంలోపే ఉండాల్సినా ఏ ఏడాది కూడా ఆ మేరకు లేవని దువ్వూరి కృష్ణ గుర్తు చేశారు. కేంద్రంతోనూ, గత టీడీపీ సర్కారుతోనూ పోల్చి చూస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువగానే ఉన్నాయని స్పష్టం చేశారు. ముగిసిన ఆర్థిక ఏడాదికి గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా జీఎస్‌డీపీలో అప్పులు కేవలం 2.09 శాతానికే పరిమితం చేశామని వివరించారు. టీడీపీ హయాంలో అప్పులు 143.25 శాతం మేర పెరగ్గా ఇప్పుడు మూడేళ్లలో 52.36 శాతమే పెరిగాయని తెలిపారు. రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అప్పులు, ప్రభుత్వ పూచీకత్తుతో వివిధ సంస్థలు తీసుకున్న అప్పులు మొత్తం రూ.1,34,584 కోట్లు కాగా 2019 మే నాటికి రూ.3,27,372 కోట్లకు పెరిగాయని వెల్లడించారు. అంటే ఏటా దాదాపు 19.46 శాతం అప్పులు పెరిగాయన్నారు. ఈ మూడేళ్లలో ఏటా కేవలం 15.77% చొప్పున మాత్రమే పెరిగాయని చెప్పారు.

బాబు బకాయిలు బారెడు
విభజన నాటికి 2014లో విద్యుత్‌ రంగ అప్పులు రూ.29,703 కోట్లు కాగా 2019 నాటికి ఏకంగా రూ.68,500 కోట్లకు టీడీపీ ప్రభుత్వం పెంచిందని దువ్వూరి తెలిపారు. ‘అంటే అప్పులు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. విద్యుత్‌ పంపిణీ సంస్థల బకాయిలు 2014లో రూ.2,893 కోట్లు ఉండగా టీడీపీ హయాంలో ఏకంగా రూ.21,540 కోట్లకు పెరిగాయి. గత సర్కారు దిగిపోతూ పెట్టిన ఇతర బకాయిలు దాదాపు రూ.39 వేల కోట్లున్నాయి. 2019–20లో ఆర్థిక మందగమనం కారణంగా కేంద్ర పన్నుల వాటా రూపంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో మైనస్‌ 3 శాతమే వచ్చాయి. ఆ తర్వాత కోవిడ్‌ పరిస్థితులను అస్తవ్యస్తం చేసింది. దీంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా తగ్గింది’ అని దువ్వూరి పేర్కొన్నారు.

తప్పుడు సమాచారం, అసత్యాలు..
‘పబ్లిక్‌ డొమెయిన్‌లో అన్ని వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. వాస్తవానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చూస్తే రూ.3.81 లక్షల కోట్లు కూడా లేవు. కానీ పత్రికలో మాత్రం రూ.4.13 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు కథనాలు రాస్తున్నారు. ప్రభుత్వ పూచీకత్తుతో వివిధ సంస్థలు చేసిన వాస్తవ అప్పులు కేవలం రూ.1.17 లక్షల కోట్లు కాగా అవి రూ.1.38 లక్షల కోట్లు అని రాస్తున్నారు. రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చేలా ఇలా తప్పుడు సమాచారం ఇవ్వడం, అసత్యాలు ప్రచారం చేయడం మంచిది కాదు’ అని దువ్వూరి సూచించారు.

మరిన్ని వార్తలు