డీఎంకేలోకి వలసలు..

22 Jul, 2021 09:39 IST|Sakshi

స్టాలిన్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న అన్నాడీఎంకే మాజీ ఎంపీ గోవిందరాజ్‌ 

అన్నాడీఎంకే, ఏఎంఎంకేలకు డీఎంకే తీర్థం 

అన్నాడీఎంకే ఒక ఓటి కుండ: రాజన్‌ 

సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సమక్షంలో అన్నాడీఎంకే మాజీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) నేతలు డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. గడిచిన తమిళనాడు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే విజయఢంకా మోగించి అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు అధికారంలో ఉండిన అన్నాడీఎంకే ప్రధాన ప్రతిపక్ష స్థానంలోకి వెళ్లింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ మూడు నెలల కాలం ప్రభుత్వం కరోనా కట్టడి, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వివిధ పార్టీలకు చెందిన నేతలు డీఎంకేకు ఆకర్షితులవుతూ పార్టీలో చేరడం ప్రారంభించారు.

అన్నాడీఎంకే మాజీ మంత్రులు తోప్పు వెంకటాచలం, పళనియప్పన్‌ పలు జిల్లాలకు చెందిన నిర్వాహకులు ఇప్పటికే డీఎంకేలో విలీనమైనారు. తంజావూరు, ధర్మపురి, సేలం, నామక్కల్, రామనాథపురం, కన్యాకుమారీ జిల్లాలకు అన్నా డీఎంకే, ఏఎంఎంకే నేతలు చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వంలో కార్మిక సంక్షేమశాఖా మంత్రిగా పనిచేసిన నటరాజన్, అతని కుమారుడు, ఏఎంఎంకే జిల్లా కార్యదర్శి ఆనందన్, మాజీ మంత్రి శేఖర్‌ కుమారుడు పట్టుకోట్టై సెల్వం డీఎంకేలో చేరారు.

అలాగే కుమరి జిల్లా కార్యదర్శి సురేష్‌ రాజన్‌ సహా 73 మంది అన్నాడీఎంకే నేతలు డీఎంకేలో విలీనం అయ్యారు. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగంకు చెందిన 14 మంది పార్టీ యూనియన్‌ కార్యదర్శులు, నలుగురు నగర కార్యదర్శులు, 10 మంది పంచాయతీ అధ్యక్షులు, ముగ్గురు కౌన్సిలర్లు డీఎంకేలో చేరారు. మంత్రులు దురైమురుగన్‌ (పార్టీ ప్రధాన కార్యదర్శి) పొన్ముడి, ముత్తుస్వామి, పలువురు అగ్రనేతలు పాల్గొన్నారు. 

అన్నాడీఎంకే ఓటి కుండ: రాజన్‌
అన్నాడీఎంకే ఒక ఓటి కుండని, శశికళ చేతుల్లోకి వెళ్లినా అతకడం సాధ్యం కాదని మాజీ మంత్రి నటరాజన్‌ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేను వీడి డీఎంకేలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లా డుతూ, అన్నాడీఎంకేలో ఐక్యత లేదు, పార్టీ కేడర్‌ అయోమయంలో పడిపోయిందని విమర్శించారు.
 

మరిన్ని వార్తలు