ఇక ఇప్పుడు జాతీయ నేతల వంతు..!  

25 Mar, 2021 08:46 IST|Sakshi

27 నుంచి ఒకరి తర్వాత మరొకరి రాక 

28న చెన్నై, సేలంలో రాహుల్‌ పర్యటన 

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి జాతీయ నేతలు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఈనెల 27వ తేదీ నుంచి ఒకరి తర్వాత మరొకరు పర్యటించనున్నారు. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసింది. ఆయా అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఉరకలు తీస్తున్నారు. అలాగే కన్యాకుమారి లోక్‌సభ ఉప ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ పోటీలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో  తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలుత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆ తర్వాత రక్షణ మంత్రి రాజనాథ్‌ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చెన్నై హార్బర్‌ నియోజకవర్గంలో పోటీలో ఉన్న యువజన నేత వినోజ్‌ బి సెల్వంకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అలాగే కేంద్రమంత్రి స్మృతి ఇరాని ధౌజండ్‌ లైట్స్‌ అభ్యర్థి కుష్భుకు మద్దతుగా ప్రచారానికి సిద్ధం అయ్యారు. 

28న ఒకే వేదిక మీదకు... 
ఇప్పటికే పలుమార్లు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈనెల 28న మలి విడత ప్రచారానికి సిద్ధం అయ్యారు. చెన్నై వేళచ్చేరిలో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి హసన్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సేలంలో భారీ ర్యాలీతో ఓటర్ల వద్దకు వెళ్లనున్నారు. అదే రోజు సాయంత్రం సేలం సీలనాయకన్‌ పట్టిలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఇంత వరకు డీఎంకే కూటమి నేతలు ఒకే వేదిక మీదకు రాలేదు. ఈ బహిరంగ సభ వేదికగా రాహుల్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, మైనారీటీ పార్టీల నేతలు ఖాదర్‌ మొహిద్దీన్, జవహరుల్లా, తమీమున్‌ అన్సారీ, వామపక్ష నేతలు బాలకృష్ణన్, ముత్తరసన్‌లతో పాటుగా డీఎంకే మిత్రపక్షాల నేతలు అందరూ ఒకే చోట కలవనున్నారు.  

ఉచిత పథకాలతో పేదరికం పోదు: కమల్‌ వ్యాఖ్య 
సాక్షి, చెన్నై: ఉచిత పథకాలు అమలు చేసినంతమాత్రాన పేదరికం తొలగే ప్రసక్తి లేదని మక్కల్‌ నీదిమయ్యం అధినేత కమల్‌హాసన్‌ అన్నారు. బుధవారం కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి కమల్‌ మాట్లాడుతూ.. ఉచితాలు ఇచ్చేస్తున్నారు కదా..? అని ఓట్లు వేస్తే మరో ఐదేళ్లు తీవ్రసంకటం ఎదుర్కోవడం తథ్యమని హెచ్చరించారు. ఉచిత పథకాల రూపంలో ప్రతి ఒక్కరి నేత్తిన అప్పులభారం పెరగబోతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి నెత్తిన రూ. 65 వేల అప్పు ఉందన్నారు. భవిష్యత్తులో రూ. 2లక్షలకు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఓటు వేసే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. తిరుచ్చిలో సాగిన ప్రచారంలో కమల్‌పై ఓ మహిళ భారతీయార్‌చిత్ర పటాన్ని విసరడం కలకలం రేపింది. ఇక కమల్‌కు మద్దతుగా గురువారం కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్‌ ప్రచారం చేయనున్నారు.  
 

మరిన్ని వార్తలు