ఎవరి లెక్కలు వారివే!

18 Aug, 2020 07:06 IST|Sakshi
పన్నీరు సెల్వం, పళని స్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌

సాక్షి, చెన్నై: సార్వత్రిక ఎన్నికలకు తమిళ పార్టీలు సిద్ధమవుతున్నాయి. సీట్ల పంపకాలు, గెలుపు స్థానాల ఎంపిక మీద దృష్టి పెట్టే పనిలో పడ్డాయి. వివాదాలకు చోటు ఇవ్వకుండా తమ మద్దతు దారులకు సమంగా సీట్లను పంచేందుకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీర్, కో కన్వీనర్‌ పళని ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇక, తమ గెలుపు ఖాయమన్నట్లు సర్వేలు చెబుతుండటంతో కాంగ్రెస్‌కు సీట్ల సంఖ్య తగ్గించేందుకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ కసరత్తులు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. 2021 సార్వత్రిక నగారా మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్‌లో మోగే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగా ఎన్నికల కమిషనర్‌ సత్యప్రద సాహూ కసరత్తు చేస్తున్నారు.

నవంబర్‌ 16న నమూనా ఓటరు జాబితా, జనవరి 15న తుది ఓటర్ల జాబితాను ప్రకటించ బోతున్నట్లు ప్రకటన చేశారు. డిసెంబరు 15 వరకు ఓటరు జాబితాలో ఆన్‌లైన్‌ ద్వారా మార్పులు చేర్పులు చేసుకోవచ్చని సూచించారు. ఎన్నికలకు ఎనిమిది నెలల సమయం ఉన్నా, తమిళ పార్టీలు ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేసుకుని కసరత్తుల వేగాన్ని పెంచాయి. ఇందులో డీఎంకే, అన్నాడీఎంకేలు ముందు ఉండగా, మేము సైతం అంటూ బీజేపీ, కాంగ్రెస్‌ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. 

సమానంగానే పంపకాలు..
ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఐకమత్యంతో ముందుకు సాగేందుకు అన్నాడీఎంకే నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం, కో కన్వీనర్‌ పళని స్వామి శిబిరాలు సమానంగా సీట్లను పంచుకునేందుకు ఓ నిర్ణయానికి వచ్చిన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. బీజేపీకి 20, పీఎంకేకు 20, డీఎండీకేకు ఓ ఐదు, మిగిలిన మిత్రులకు తలా ఒకటి రెండు అప్పగించి, కనీసం 180 స్థానాల్లో పోటీ లక్ష్యంగా అన్నాడీఎంకే నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటుంన్నాయి. బీజేపీ కలిసి రాకపోతే పీఎంకేకు మరో ఐదు సీట్లు ఇచ్చి, మిత్రులకు తలా ఓ సీటు కోత పెట్టి, అవసరం అయితే, 200 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోన్నట్లు చర్చ సాగుతోంది. ఏ శిబిరం అయితే, అధిక స్థానాల్లో గెలుస్తుందో, వారే సీఎం అనే ఏకాభిప్రాయానికి సైతం రాబోతున్నారని ఓ నేత పేర్కొనడం గమనార్హం. ఇందు కోసం మరి కొద్ది రోజుల్లో పార్టీ సర్వ సభ్యం సమావేశం కానున్నదని, ఇందులో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు చెప్పారు. 

సర్వేలను నిజం చేద్దామంటూ.. 
డీఎంకే ఉదయ సూర్యుడి గెలుపు ఖాయమని ఓ సర్వేలో తేలింది. ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిషోర్‌ వ్యవహరిస్తున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ బృందం ఓ నివేదికను డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు ఇచ్చినట్టు సమాచారం. ఇందులోనూ అధికారం డీఎంకేకు ఖాయం అన్నట్టుగా ఉండటం గమనార్హం. అయితే డీఎంకే విజయం సాధించాలంటే అధిక స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంది. ఆ పార్టీకి మిత్ర పక్షాలు ఎక్కువే అయినా, వారికి సింగిల్‌ డిజిట్‌ సీట్లతో సర్దుబాటుకు అవకాశం ఎక్కువే. ఇక్కడ సమస్య అంతా కాంగ్రెస్‌ రూపంలోనే. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 63, 40 అంటూ సీట్లు కేటాయించినా, గెలిచింది సింగిల్‌ డిజిట్‌ మాత్రమే. ఈ దృష్ట్యా, ఈ సారి కాంగ్రెస్‌ ఆశించిన మేరకు సీట్లను డీఎంకే ఇచ్చే అవకాశాలు లేదన్న సంకేతాలు వెలువడ్డాయి. 30 లోపు సీట్లను కాంగ్రెస్‌కు సర్దుబాటు చేసి, కనీసం 180కు పైగా స్థానాల్లో పోటీ లక్ష్యంగా స్టాలిన్‌ వ్యూహాలకు పదును పెట్టినట్లు డీఎంకే నేత ఒకరు పేర్కొన్నారు. డీఎంకే కూటమిలో సీఎం అభ్యర్థి స్టాలిన్‌ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి వ్యాఖ్యానించడం గమనార్హం. 

గెలిపిస్తే...ఇనోవా 
ఎన్నికల వ్యూహాలకు ఆ పార్టీ నేత మురుగున్‌ పదునుపెడుతున్నారు. జిల్లాల నేతలతో సమావేశాలు, సమీక్షలు అంటూ వీడియో కాన్ఫరెన్స్‌లతో బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థిని గెలిపించే జిల్లా కార్యదర్శికి ఓ ఇన్నోవా కారు బహుకరించనున్నట్టు మురుగన్‌ ప్రకటించారు. కనీసం 25 మంది ప్రతినిధులు అసెంబ్లీలో ఈ సారి అడుగు పెట్టాల్సిందేనని, అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచి ఎన్నికల కసరత్తుల వేగాన్ని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. దీన్ని బట్టి చూస్తే, అన్నాడీఎంకే వద్ద కనీసం 40 నుంచి 50 మేరకు సీట్లను బీజేపీ ఆశించే అవకాశాలు ఉన్నాయి.   

మరిన్ని వార్తలు