చార్మినార్‌ నమాజ్‌ సంతకాల సేకరణ.. బండి సంజయ్‌ మండిపాటు

2 Jun, 2022 13:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చార్మినార్‌లో నమాజ్‌ కోసం సంతకాల సేకరణపై రాజకీయ వివాదం ముదురుతోంది. కాంగ్రెస్‌ నేత రషీద్‌ఖాన్‌ సంతకాల సేకరణ చేపట్టడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే భాగలక్ష్మి ఆలయంపై చేయి వేయాంటూ సవాల్‌ విసిరారు ఎంపీ బండి సంజయ్‌.

‘‘మేం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటేనే.. మీకు నమాజ్‌ గుర్తొచ్చిందా?. అంతకుముందు నమాజ్‌ ఎందుకు చేయలేదు?. కాంగ్రెస్‌, ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ కలిసి డ్రామాలాడుతున్నాయి అంటూ విరుచుకుపడ్డారు ఆయన. చార్మినార్‌ దగ్గర ఆలయం లేదని చెప్పేవాడు మూర్ఖుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. 

ఇదిలా ఉంటే..  సంతకాల సేకరణను ముస్లి సమాజం సైతం హర్షించదని ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు. చార్మినార్ వద్ద సంతకాల సేకరణపై రాజా సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. షో పుటప్ ప్రోగ్రాం చేసేవాళ్లపై చర్యలు తీసుకోవాలని రాజా సింగ్‌ కోరారు. ఇలాగైతే.. మసీద్ వద్ద మేము కూడా సంతకాల సేకరణ చేయాలా? అని ప్రశ్నించారు. కానీ, తామూ అలా చేస్తే రాష్ట్రంలో వాతావరణం దెబ్బతింటుందని రాజా సింగ్‌ అన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది? కాంగ్రెస్‌ నేత రషీద్ ఖాన్ మీద సుమోటోగా కేసు నమోదు చేయాలని, అసలు రషీద్‌ ఖాన్‌కు సిగ్గుందా అని మండిపడ్డారు రాజా సింగ్‌. చార్మినార్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, అటు నుంచి పెద్ద వాహనాలు వెళ్తే కూలిపోయే స్థితిలో ఉందని గుర్తు చేస్తున్నారు ఆయన.

>
మరిన్ని వార్తలు