తెలంగాణ ఏర్పడ్డాక పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ ఎంత ఉందో ఇప్పుడూ అంతే ఉంది: సీఎం కేసీఆర్‌

8 Nov, 2021 02:23 IST|Sakshi

పెట్రోల్, డీజిల్‌ ధరలపై సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ ఏర్పడ్డాక మేము అధికారం చేపట్టినప్పుడు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ ఎంత ఉందో ఇప్పుడూ అంతే ఉంది. నయాపైసా పెంచలేదు. అసలు పెంచనప్పుడు తగ్గించాలనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. వ్యాట్‌ తగ్గించం. మమ్మల్ని తగ్గించమని ఏ సన్నాసి అడుగుతాడు. పెంచిన సన్నాసే తగ్గించాలి..’ అని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

ఆదివారం మీడియా సమావేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలపై సీఎం మాట్లాడారు. ‘ఇటీవలి ఉప ఎన్నికల్లో ప్రజలు తీవ్రంగా స్పందించి బీజేపీని చితక్కొట్టడం, త్వరలో 4 రాష్ట్రాల ఎన్నికలుండడం తోనే కంటి తుడుపు చర్యగా పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్‌ డ్యూటీని కేంద్రం తగ్గించింది. ఏడేళ్లలో పెట్రోల్, డీజిల్‌పై కొండంత సెస్‌ పెంచిన కేంద్రం ఇప్పుడు పిసరంత తగ్గించి ఘన కార్యం చేసినట్టు వ్యవహరిస్తోంది. రాష్ట్రాలు కూడా తగ్గించాలని బీజేపీ ధర్నాలు చేస్తానం టోంది. ధర్నాలు మీరు చేయాలా? మేము చేయాలా? పెట్రోల్, డీజిల్‌పై సెస్‌ను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. బీజేపీకి ప్రజల మీద ప్రేమ ఉంటే మళ్లీ 2014 తరహాలో రూ.77కే లీటర్‌ పెట్రోల్‌ ఇవ్వొచ్చు..’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

సెస్‌తో లక్షల కోట్లు ఆర్జించారు
‘2014లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు బ్యారెల్‌కు 105.52 డాలర్లు ఉండగా, లీటర్‌ పెట్రోల్‌ రూ.77, డీజిల్‌ రూ.68 ఉండే. ఇప్పుడు క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 83 డాలర్లకు తగ్గినా, లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.114, డీజిల్‌ ధర రూ.107.40 ఉంది. 2014 నుంచి నేటి వరకు ఏ ఒక్క ఏడాది కూడా క్రూడ్‌ ధరలు 105 డాలర్లు దాటలేదు. ఒకానొక సందర్భంలో 35 డాలర్లకు పడిపోయి బ్రెజిల్, రష్యాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. అయినా, అంతర్జాతీయ విపణిలో ధర పెరిగిందంటూ కేంద్రం అబద్ధాలు చెప్పి ప్రజలకు మోసం చేసింది.

ధరలు పెంచే విధానంలో మరో మోసానికి పాల్పడింది. సుంకం పెంచితే రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వాల్సి వస్తుంది. దీనిని ఎగ్గొట్టడానికి సుంకానికి బదులు సెస్‌ విధించి ధరలు పెంచింది. ఒక లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై రూ.30–35 వరకు  పెంచుతూ పోయింది. అనేక లక్షల కోట్ల రూపాయలు ఆర్జించింది. దీనిపై ఈ రోజు ఏపీ సీఎం పేపర్‌లో యాడ్‌ కూడా ఇచ్చారు. రాష్ట్రాల నోరు కొట్టి ఈ పెరుగుదల మీద వచ్చిన మొత్తం డబ్బు వాళ్లే తీసుకుంటున్నరు. పెట్రోల్, డీజిల్‌ మీద సెస్సులు వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకుంటే మిమ్మల్ని పండనీయం. నిలవనీయం. ఇప్పుడింకా పోరాటం చేస్తాం. 100 శాతం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి పోరాటాన్ని నిరంతరంగా కొనసాగిస్తాం. పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించమని మేమే ధర్నా చేస్తాం. ఎవరిని కలుపుకోవాలో కలుపుకొంటాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు. 

తక్షణమే ట్రిబ్యునల్‌కు రిఫర్‌ చేయాలి
‘కేంద్రానికి దమ్ముంటే తెలంగాణకు జల కేటాయింపుల అంశాన్ని తక్షణమే ట్రిబ్యునల్‌కు రిఫర్‌ చేయాలి. సెక్షన్‌ సీ కింద కేంద్రం ఎందుకు రిఫర్‌ చేయట్లేదు? ఇది అసమర్థ ప్రభుత్వం కాదా? కొత్త రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రానికి నీళ్లు రావద్దా? కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ డ్రామానా?  కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సూచనతోనే సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకున్నం. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ట్రిబ్యునల్‌కు తక్షణమే రిఫర్‌ చేయండి. ట్రిబ్యునల్‌కు రిఫర్‌ చేయడానికి ఏడేళ్లా? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఏం చేస్తుండు? ఎందుకు మాట్లాడరు?’ అని నిలదీశారు. 

నీళ్లు తెచ్చింది వరి వేసుకోమని కాదు
‘ప్రత్యామ్నాయ పంటల వివరాలను స్థానిక వ్యవసాయ అధికారులకు ఇచ్చాం. నువ్వులు, పెసర్లు వేస్తే వరి కంటే ఎక్కువ డబ్బులు వస్తయి. సాగునీరు తెచ్చింది వరి పంట వేసుకోవడానికే కదా అని  కొంతమంది మూర్ఖంగా మాట్లాడుతున్నరు. నీళ్లు తెచ్చింది పంటలు వేసుకోవడానికి. వరి వేసుకోమని కాదు..’ అని స్పష్టం చేశారు. 

ఇక ఓపిక అవసరం లేదు
మరో రెండేళ్లలో లోక్‌సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ను మళ్లీ ముందుకు తీసుకెళ్తారా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఇంకా ఆలోచనలు చేయలేదని కేసీఆర్‌ బదులి చ్చారు. బీజేపీతో ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అని టీఆర్‌ఎస్‌పై ఉన్న విమర్శలపై మాట్లాడుతూ..  సీఎం పదవిలో ఉండి కేంద్రంతో రాజ్యాంగబద్ధ సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుందన్నారు. కమీనే.. నాలాయక్‌ మనుషులే ఇలా అంటారని మండిపడ్డారు. ‘కేంద్రంతో ఎందుకు అవసరమైన కయ్యం. కొత్త రాష్ట్రం అని ఇప్పటి వరకు ఓపికతో ఉన్నం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నం. ఇక ఓపికతో ఉండాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి మీకు (మీడియాకు) రోజూ విందే.. నేనే మాట్లాడుతా.. ఈ చిల్లర గాళ్లు.. కిరికిరిగాళ్లు తెలంగాణను ఆగం చేస్తే కేసీఆర్‌ మౌనంగా ఉండడు..’ అని సీఎం అన్నారు. 

మరిన్ని వార్తలు