నా విజయం ప్రజలకు అంకితం

4 Nov, 2021 00:51 IST|Sakshi
హుజూరాబాద్‌లో మాట్లాడుతున్న ఈటల 

నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా రుణం తీరదు

కలిసికట్టుగా కేసీఆర్‌ చెంప చెళ్లుమనిపించారు 

ఈటల రాజేందర్‌ భావోద్వేగం 

హుజూరాబాద్‌: అధికార పార్టీ బెదిరింపులను లెక్క చేయకుండా తనకు అండగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకు తన విజయాన్ని అంకితమిస్తున్నట్లు మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తెలిపారు. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా వారి రుణం తీరదన్నారు. నియోజకవర్గ ప్రజలంతా కలిసికట్టుగా ఉండి కేసీఆర్‌ చెంప చెళ్లుమనిపించారని చెప్పారు. బుధవారం హుజూరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

చరిత్రలో ఇలాంటి ప్రలోభాల ఎన్నిక ఇప్పటివరకు జరగలేదని ఈటల అన్నారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా, నియోజకవర్గ ప్రజలు గుండెను చీల్చి, తమ ఆత్మను ఆవిష్కరించి తనను గెలిపించారంటూ భావోద్వేగానికి గురయ్యారు. కులాల పరంగా చీలిక తెచ్చినా, అధికార పార్టీ నేతలందరూ బెదిరింపులకు పాల్పడినా, ప్రజలు తనను తమ గుండెల్లో పెట్టుకుని భారీ విజయాన్ని అందించారని తెలిపారు. తనను టీఆర్‌ఎస్‌ బయటకు పంపాక బీజేపీ అక్కున చేర్చుకుందని, కేంద్రమంత్రి అమిత్‌షా సంపూర్ణ సహకారం అందించారని చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మద్దతుగా నిలిచారని తెలిపారు.

ఓయూ, కేయూకు చెందిన వారితో పాటు ఎందరో విద్యార్థులు సహకరించారని, సోషల్‌ మీడియా వేదికగా కేసీఆర్‌ కుయుక్తులను చీల్చి చెండాడారని వివరించారు. పోలీసులే డబ్బుల పంపిణీ చేయించారని, హుజూరాబాద్‌ ప్రజలను అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. కుట్రదారుడు కుట్రలలోనే నాశనం అయిపోతాడన్నారు. రెండు గుంటల భూమి ఉన్న వ్యక్తి రూ.400 కోట్ల డబ్బు ఎలా ఖర్చుపెట్టాడని ప్రశ్నించారు.  

2వ తేదీనే నాకు దీపావళి 
దేశవ్యాప్తంగా ఈ నెల 4న దీపావళి జరుపుకొంటుంటే.. తాను రెండో తేదీనే జరుపుకున్నట్లు ఈటల పేర్కొన్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ ఓట్లు సాధించానని చెప్పారు. ఇది కేసీఆర్‌ అహంకారంపై ప్రజల విజయంగా అభివర్ణించారు. దళితబంధు కింద రూ.10 లక్షలు పదిసార్లు ఇచ్చినా తనను మర్చిపోబోమని దళితులు అండగా నిలిచారన్నారు. విలేకరుల సమావేశానంతరం స్థానిక అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈటల వెంట మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ ఉన్నారు. 

ఈటలపై కేసు నమోదు 
కరీంనగర్‌ క్రైం: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి విజయోత్సవర్యాలీలో పాల్గొన్నందుకు హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్‌ త్రీటౌన్‌ సీఐ దామోదర్‌రెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గెలిచిన ఈటల రాజేందర్, తన అనుచరులు ఊరేగింపుగా కోర్టుప్రాంతం వద్దకు వచ్చారు. ఎన్నికల నియమావళితో పాటు పలు నిబంధనలు ఉల్లంఘించడంతో ఈటల, అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు