‘ఈటల మేలు చేస్తడు.. కీడు చెయ్యడు’

20 Oct, 2021 03:32 IST|Sakshi
చెల్పూర్‌లో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

దళితబంధు అమలు చేయాలని అడిగింది నేనే.. 

బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌  

హుజూరాబాద్‌: ‘దళితబంధు వెంటనే అమలు చేయాలని నేనే డిమాండ్‌ చేశాను. కలెక్టర్ల పెత్తనం, బ్యాంకుల పెత్తనం ఉండొద్దని కోరింది నేనే. హుజూరాబాద్‌ ప్రజలపై ప్రేమతో ఇచ్చావో, ఓట్లపై ప్రేమతో ఇచ్చావోగానీ, తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశాను. ఎప్పటిలోగా ఇస్తావో చెప్పాలని కోరాను. అన్ని కులాల్లోని పేదలకు కూడా ఇలాంటి స్కీం పెట్టాలని కోరింది నేనే. ఈటల రాజేందర్‌ మేలు చేస్తాడు తప్ప కీడు చెయ్యడు’ అని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం హుజూరాబాద్‌ మండలంలోని శాలపల్లి, చెల్పూర్, రాజపల్లి, రంగాపూర్, రాంపూర్, కనుకులగిద్ద, చిన్నపాపయ్యపల్లిల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళితబంధు ఆపాలని తానే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం చేస్తున్నారని.. తాను వద్దని లేఖ రాసినట్టు నిరూపిస్తారా అని సవాల్‌ విసిరారు. ‘70 రోజులు అమలు కాని దళితబంధు ఏడు రోజుల్లో అమలవుతుందా? దళితుల మీద ప్రేమ ఉంటే దళితులకు సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదు? మూడు ఎకరాల భూమి ఎవరు అడ్డుకున్నారు?’ అని ఈటల ప్రశ్నిం చారు. కేసీఆర్‌ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఈటల ఆరోపించారు. ఓటుకు రూ.20 వేలు, రూ.30 వేలతో బేరం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ గెలిస్తే బానిసత్వంలో మగ్గిపోతామని, హుజూరాబాద్‌లో జరుగుతున్న యుద్ధంలో ధర్మం వైపు నిలబడాలని ప్రజలను కోరారు.  

మరిన్ని వార్తలు