1,48,666 ఉద్యోగాలు ఖాళీ

13 Sep, 2020 03:39 IST|Sakshi
శనివారం టీజేఎస్‌ కార్యాలయంలో నినాదాలు చేస్తున్న కోదండరామ్‌ తదితరులు

రాష్ట్రం వచ్చి ఏడేళ్లయినా నిరుద్యోగ సమస్య తీరలే.. 

ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ ప్రకటించాలి 

ఏపీలాగా స్థానికులకు ఉద్యోగాలిచ్చే చట్టం తేవాలి 

ఈ నెల 21న హలో నిరుద్యోగ చలో అసెంబ్లీ యాత్ర 

టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అయినా నిరుద్యోగ సమస్య తీరలేదని, ఆ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పేర్కొన్నారు. శనివారం టీజేఎస్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని ఈ నెల 21న ‘హలో నిరుద్యోగ చలో అసెంబ్లీ’ పేరిట విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించా రు. రాష్ట్రంలో 1,48,666 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కొత్త జిల్లాలు, కొత్త మండలాల్లో దాదాపు 50,000కు పైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లాగా స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా ఒక చట్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ప్రైవేటు ఉద్యోగులకు సాయం చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ ప్రకటించాలని, నాగులు లాంటి వాళ్లు ఆత్మహత్యయత్నం చేసుకున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించాలన్నారు.  

కొత్త చట్టంపై చర్చించాం.. 
కొత్త రెవెన్యూ చట్టంపై అఖిల పక్షంలో చర్చించామని కోదండరామ్‌ తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ చట్టంలో పరిష్కారం చూపలేదని పేర్కొన్నారు. సాదా బైనామా, పోడు భూములు, అసైన్డ్‌ భూము లు, కౌలు రైతుల సమస్యలపై రెవెన్యూ చట్టంలో స్పష్టత ఇవ్వలేదన్నారు. అసైన్డ్‌ భూములను రైతుల దగ్గర నుంచి బెదిరించి ప్రభుత్వం తీసుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు రమేశ్‌ మాట్లాడుతూ అసెంబ్లీలో విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం చర్చించడం లేదని, నిరుద్యోగులకు ఎలాంటి భరోసా కల్పించడం లేదన్నారు.

ఇదీ శాఖల వారీగా ఖాళీల లెక్క.. 
అగ్రికల్చర్‌–1,740, పశుసంవర్థక శాఖ–2,087, మార్కెటింగ్‌ శాఖ–583, బీసీ వెల్ఫేర్‌–1,027, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఫారెస్ట్‌–3,367, ఉన్నత విద్య– 12,857, ఎనర్జీ–26, పాఠశాల విద్య– 24,702, సివిల్‌ సప్లయ్స్‌–546, ఫైనాన్స్‌–1,375, జీఏడీ–984, హెల్త్‌– 23,512, హోం–37,218, హౌసింగ్‌–9, ఇరిగేషన్‌– 2,795, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌–7, ఇండస్ట్రీస్‌–366, ఐటీ–3, లేబర్‌– 2,893, లా–1,854, లెజిస్లేటివ్‌– 300, మున్సిపల్‌–1,533, మైనారిటీ–51, పబ్లిక్‌అడ్మిన్‌–6, ప్లానింగ్‌–178, పంచాయతీరాజ్‌– 5,929, రెవెన్యూ–8,118, సోషల్‌ వెల్ఫేర్‌–5,534, రోడ్లు భవనాలు–962, ట్రైబల్‌ వెల్పేర్‌–5,852, మహిళా, శిశు సంక్షేమం–1,812, యూత్‌ సర్వీసెస్‌–440. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు