తప్పంతా రాష్ట్ర ప్రభుత్వానిదే

14 Nov, 2021 01:43 IST|Sakshi

ధాన్యం కొనుగోళ్లలో కేంద్రంపై అసత్య ప్రచారం

ఒప్పందం మేరకు చివరి కేజీ వరకు కొంటాం

మీడియాతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు, ఉప్పుడు బియ్యానికి సంబంధించి తలెత్తిన వివాదంలో తప్పంతా రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిగట్టుకుని కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై విమర్శలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. బియ్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు చివరి కేజీ వరకు కేంద్రం కొనుగోలు చేస్తుందని స్పష్టంచేశారు.

తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014లో తెలంగాణలో రూ.3,404 కోట్ల విలువైన ధాన్యం కేంద్రం కొనుగోలు చేసిందని, 2021–22 నాటికి అది రూ.26,641 కోట్లకు చేరుకుందన్నారు. ముందుగా 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుని, ఆ తర్వాత 90 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచిందన్నారు. ఆ తర్వాత 108 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనాలంటూ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేశారన్నారు.

మంత్రులు ధర్నాలా?... 
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు ఇచ్చే ప్రతీ పైసా కేంద్రానిదేనని, రాష్ట్రం పెట్టే ఖర్చుకు కూడా ఎనిమిదిన్నర శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారు కూడా ధర్నాలు చేయడం ద్వారా తమ వంటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కేంద్ర మంత్రి ధర్నాలు చేసే పరిస్థితి రావొచ్చునేమోనని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వచ్చి కేంద్రంతో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గతంలో ధర్నా చౌక్‌ అవసరం లేదన్న వాళ్లే అక్కడే ధర్నాలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సైనికులపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రవీంద్రనాయక్, డి.ప్రదీప్‌కుమార్, డా.ఎస్‌.ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. 

వైద్య కళాశాలల అంశంలోనూ... 
రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటు విషయంలో కేంద్రం పలుమార్లు విజ్ఞప్తులు, లేఖలు పంపినా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ స్పందించలేదన్నారు. దేశవ్యాప్తంగా 75 మెడికల్‌ కాలేజీల ఏర్పాటులో భాగంగా ప్రతిపాదనలు పంపాలని కోరినా రాష్ట్రం నుంచి స్పందన కరువైందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టింపులకు పోకుండా బీబీనగర్‌ ఎయిమ్స్‌ భవనాలను కేంద్రానికి అప్పగిస్తే ఇతర అభివృద్ధి పనులు వేగవంతం చేసే అవకాశం ఉంటుందని హితవు పలికారు.

ఈ విషయాన్ని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌కు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ కూడా రాశారని వెల్లడించారు. దీనిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎయిమ్స్‌పై రాష్ట్ర మంత్రులు అననసర రాద్దాంతాలు మానుకోవాలన్నారు. ఎయిమ్స్‌ విషయంలో తాను ఎక్కడా వాస్తవ విరుద్ధంగా మాట్లాడలేదని చెప్పారు. కేంద్రం ఇచ్చిన ట్రైబల్‌ మ్యూజియం ఎందుకు పూర్తి చేయటంలేదో కేసీఆర్‌ ప్రభుత్వం చెప్పాలన్నారు.

ఈ మ్యూజియంను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో అధికంగా గిరిజనులే పాల్గొన్నా రని, దీనికి గుర్తింపుగా ఈ నెల 15న భగవాన్‌ బిర్సాముండా జయంతిని గిరిజన జాతీయ గౌరవ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఈ దినోత్సవాన్ని ప్రతీ ఏడాది నిర్వహించనున్నట్టు తెలియజేశారు.  

మరిన్ని వార్తలు