నూకలు తినాలన్న వాళ్లకు నూకలు చెల్లేలా బుద్ధి చెప్పాలి

28 Mar, 2022 02:12 IST|Sakshi
సిద్దిపేట జిల్లా శ్రీగిరిపల్లిలో మంత్రి హరీశ్‌పై పూలు చల్లుతున్న ఓ మహిళ

కేంద్రమంత్రి గోయల్‌ తీరుపై మండిపడ్డ మంత్రి హరీశ్‌ 

గజ్వేల్‌: ‘ఎండాకాలంలో పండే ధాన్యం నూకలైతది. అది మేం కొనలేం.. అవి మీ ప్రజలే తినేవిధంగా అలవాటు చెయ్యండి’అని గోయల్‌ హేళనగా మాట్లాడటం తగదని, ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. నూకలు తినాలని చెబుతున్న కేంద్రానికి నూకలు చెల్లేలా బుద్ధిచెప్పాల్సిన అవసరముందన్నారు.

ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం శ్రీగిరిపల్లి, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ రోజాశర్మతో కలసి హరీశ్‌రావు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వడ్లను కొనుగోలు చేయాల్సిన కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుంటోందన్నారు.

మెడికల్‌ కళాశాలలు అడిగినా, ప్రాజెక్టులకు జాతీయ హోదా అడిగినా ఇవ్వలేదని మండిపడ్డారు. కనీసం వడ్లు కొనడం కూడా కేంద్రానికి చేతకాదా? అని ప్రశ్నించారు. మరోపక్క గ్యాస్, పెట్రో, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచు తూ సామాన్యులపై భారం మోపుతున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మానుకొని చేతనైతే ధరలు తగ్గించేలా కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. ప్రభుత్వరంగ ఆస్పత్రుల్లో సింగిల్‌ యూస్‌ డయాలసిస్‌ సిస్టమ్‌ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో మూడు డయాలసిస్‌ కేంద్రాలు ఉండగా.. వాటిని నేడు 102కు పెంచబోతున్నామన్నారు. 

మరిన్ని వార్తలు