ఆశావహుల్లో ఉత్కంఠ.. గుత్తా, కడియంలకు మళ్లీ చాన్స్‌! 

26 Jun, 2021 19:52 IST|Sakshi

మండలి ఎన్నికల కోసం ఉత్కంఠగా ఎదురుచూపులు

ఆరు ఎమ్మెల్యే కోటా స్థానాలు ఖాళీ

గవర్నర్‌ నామినేటెడ్‌ సభ్యుడి పదవీ కాలం కూడా పూర్తి 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ శాసనమండలిలో స్థానం కోసం ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మండలికి ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ఈ నెల మొదటి వారంలో పూర్తయ్యింది. అలాగే గవర్నర్‌ కోటాలో నామినేట్‌ అయిన ప్రొఫెసర్‌ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలం కూడా ఈ నెల 17న పూర్తయ్యింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన స్థానాలకు గత నెల మూడో వారంలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఎన్నిక తేదీపై ఇప్పటివరకు స్పష్టత లేకున్నా ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నవారు మాత్రం ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు.  

గుత్తా, కడియం ముందు వరుసలో 
ఎమ్మెల్యే కోటాలో ఎన్నికై పదవీ కాలం పూర్తి చేసుకున్న ఆరుగురిలో మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌ ఇదే కోటాలో తిరిగి ఎన్నికవ్వాలని భావిస్తున్నారు. వీరిలో గుత్తా సుఖేందర్‌ రెడ్డికి మళ్లీ అవకాశం కల్పించి మరోసారి మండలి చైర్మన్‌గా అవకాశం కల్పిస్తారని లేదా మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది.

కడియం శ్రీహరికి కూడా ఎమ్మెల్సీగా తిరిగి అవకాశం లభిస్తుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితం వరంగల్‌ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కడియం ఇంట్లో భోజనం చేశారు. మరోవైపు రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక కొంతకాలం స్తబ్దుగా ఉన్న కడియం ఇటీవలి కాలంలో తరచూ సీఎంను కలుస్తున్నారు. కడియంకు తిరిగి ప్రాధాన్యత దక్కుతుందనడానికి ఇవి సంకేతాలుగా చెబుతున్నారు. 


భారీగానే జాబితా 
మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండటంతో పదవులు ఆశిస్తున్న టీఆర్‌ఎస్‌ నేతల జాబితా భారీగానే ఉంది. పద్మశాలి, కుమ్మరి, విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని గతంలో కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆయా సామాజికవర్గ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మేయర్‌ బొంతు రాంమ్మోహన్, తక్కల్లపల్లి రవీందర్‌రావు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. వీరితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, పీఎల్‌ శ్రీనివాస్, ఎంసీ కోటిరెడ్డి, శుభప్రద పటేల్‌ వంటి వారు ఆశావహుల జాబితాలో ఉన్నారు.

టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ పార్టీలో చేరే పక్షంలో ఆయనకు తప్పనిసరిగా అవకాశం లభిస్తుందని సమాచారం. గవర్నర్‌ కోటాలో సీఎం కార్యాలయ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్, బ్రూవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికపైనే ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి కేంద్రీకరించింది.   

చదవండి: ప్రజాసేవకు పదవులు అవసరం లేదు: కడియం శ్రీహరి

Huzurabad: బిగ్‌ఫైట్‌కు టీఆర్‌ఎస్‌, బీజేపీ సై.. కానీ కాంగ్రెస్‌ ఎందుకిలా!

మరిన్ని వార్తలు