ఆ ఊపు లేదు.. హవా లేదు.. ఒక్క వరంగల్‌లో మాత్రం

4 May, 2021 08:47 IST|Sakshi

గతం కన్నా మెరుగు

వరంగల్‌లో ఒకటి నుంచి 10 స్థానాలకు చేరిన బీజేపీ 

ఖమ్మంలో ఒక్కస్థానంతో ఖాతా తెరిచింది 

మున్సిపాలిటీల్లో కానరాని హవా 

ఊహించిన మేరకు దక్కని ఫలితాలు

సాక్షి, హైదరాబాద్‌: ఆ ఊపు లేదు.. ఆ హవాలేదు.. ఆ హడావిడి లేదు.. ఆ సంబురం లేదు.. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల జోరును మినీ మున్సి‘పోల్స్‌’లో కొనసాగించలేకపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్‌ ఉపఎన్నికల్లో చతికిలపడిన బీజేపీ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేకపోయింది. పట్టణ ప్రాంతాల్లో తమకున్న పట్టును నిలుపుకోవాలని పలు వ్యూహాలు పన్నినా అధికార టీఆర్‌ఎస్‌ ముందు అవి పారలేదు. ఎక్కడా సత్తా చాటలేకపోయింది.

గ్రేటర్‌ వరంగల్‌లో మాత్రం కొంత నయం. 10 కార్పొరేటర్‌ స్థానాలను అతికష్టం మీద గెలుచుకుంది. కనీసంగా 20 కార్పొరేటర్‌ స్థానాలను దక్కించుకుంటామని పార్టీ శ్రేణులు తొలుత ధీమా వ్యక్తం చేశాయి. కానీ, ఇప్పుడు అందులో సగానికే పరిమితం కావాల్సి వచ్చింది. గతంలో గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో బీజేపీకి ఒకే ఒక్క కార్పొరేటర్‌ ఉన్నారు. ఇక్కడ పది స్థానాలు రావడం కాస్త మెరుగేనని కార్యకర్తలు భావిస్తున్నారు.  

లింగోజిగూడ లాస్‌.. 
ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బీజేపీ ఒక కార్పొరేటర్‌ స్థానాన్ని చేజిక్కించుకొని ఖాతా తెరిచింది. తమ పార్టీ కార్పొరేటర్‌ మరణంతో ఉపఎన్నిక జరిగిన లింగోజిగూడ సిట్టింగ్‌ స్థానాన్ని మాత్రం కాపాడుకోలేకపోయింది. ఖమ్మంలో తమకు ఆరేడు స్థానాలు వస్తాయని, కాంగ్రెస్‌కు ఏమీ రావని పార్టీ ముఖ్యనేతలు వేసుకున్న అంచనా తారుమారైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ తరహాలో వరంగల్‌లో ఉండాలని, కనీసంగా 20 కార్పొరేటర్‌ స్థానాలను దక్కించుకోగలిగితే పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం సులభం అవుతుందని బీజేపీ శ్రేణులు భావించాయి. మున్సిపోల్స్‌లో తాము ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కార్యకర్తలు నిరాశలో ఉన్నారు.  

చదవండి: 'పుర' పీఠాలపై గులాబీ జెండా

>
మరిన్ని వార్తలు