‘షా’ రొస్తున్నారు

26 Dec, 2023 00:32 IST|Sakshi

28న రాష్ట్రానికి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 

కమలనాథులకు లోక్‌సభ ఎన్నికలపై దిశానిర్దేశం 

పార్టీ మండల అధ్యక్షుల మొదలు.. నేతలందరితో భేటీ 

బీజేపీ ఎమ్మెల్యేలతోనూ సమావేశం 

అదే రోజు బీజేఎల్పీ నేతను ప్రకటించే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలోని మిగతా రాజకీయ పార్టీల కంటే ముందుగా సన్నాహాలకు బీజేపీ తెరలేపింది. ఈ నెల 28న నగర శివారు కొంగరకలాన్‌లోని శ్లోక ఫంక్షన్‌ హాలులో నిర్వహిస్తున్న లోక్‌సభ సన్నాహక సమావేశానికి బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్‌షా హాజరవుతున్నారు.

పార్టీ మండల అధ్యక్షులు మొదలుకుని రాష్ట్రస్థాయి వరకు నాయకుల వరకు హాజరయ్యే ఈ భేటీలో రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 15 నుంచి 20 మందిని ఆహ్వనిస్తున్నారు. మొత్తంగా రెండున్నరవేల మంది వరకు నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. తెలంగాణలో పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులంతా హాజరుకావడం ద్వారా లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సంసిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందని ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. 

ప్రజల వద్దకు ఎలా వెళ్లాలన్న దానిపై ఆ సమావేశంలో స్పష్టత 
ప్రధానంగా ఏయే అంశాల ప్రాతిపదికన ప్రజల వద్దకు వెళ్లాలి, లోక్‌సభ ఎన్నికల్లో వివిధ వర్గాల ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఏయే అంశాలు ప్రస్తావించాలి, మోదీ సర్కార్‌ పదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాల ద్వారా అందిన ఫలాలపై ఏ విధంగా ప్రచారం నిర్వహించాలన్న దానిపై ఆ సమావేశం తర్వాత స్పష్టత వస్తుందని చెబుతున్నారు.

గత లోక్‌సభ ఎన్నికలు 2019 ఏప్రిల్‌లో జరగగా, ఈసారి అంతకంటే ముందుగా మార్చి చివరిలోగానే ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. అందుకే అన్ని పార్టీల కంటే ముందుగానే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడం ద్వారా మంచి ఫలితాలు (గతంలో గెలిచిన 4 ఎంపీ సీట్లకు బదులు 10 వరకు గెలిచి.. సీట్లు పెంచుకోవాలనే లక్ష్యంతో జాతీయ నా­యకత్వం ఉంది) సాధిస్తామనే విశ్వాసం పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఈ భేటీ సందర్భంగా అ­సెంబ్లీ ఎన్నికల ఫలితాలు, పార్టీ అనుకున్న స్థాయిలో ఫలితాలు రా­కపోవడానికి కారణాలపైనా విశ్లేషించవచ్చని చెబుతున్నారు.  

లోక్‌సభ ఇన్‌చార్జిల నియామకంపై కసరత్తు 
రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు పార్టీపరంగా లోక్‌సభ ఇన్‌చార్జిల నియామకం (17 మంది సంస్థాగతంగా ఫుల్‌టైమర్స్‌కు అదనం)తో పాటు ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక వర్కింగ్‌ టీమ్‌ నియామకంపై కూడా ఈ భేటీలో కసరత్తు జరుగనుందని పార్టీ నేతల సమాచారం. ఇటీవల కొత్తగా గెలిచిన 8మంది ఎమ్మెల్యేలతో అమిత్‌షా ప్రత్యేకంగా సమావేశం కావడంతో పాటు... భారతీయ జనతా శాసనసభాపక్షం (బీజేఎల్పి)నేత ఎన్నిక కూడా అదే రోజు జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

ఈ పదవి కోసం ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. వరుసగా మూ­డు­సార్లు గెలిచిన టి.రాజాసింగ్, రెండుసా­ర్లు గెలిచిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కేసీఆర్, రేవంత్‌రెడ్డిలను ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డిల్లో ఒకరికి ఈ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవా­రం బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో... పార్టీపరంగా లోక్‌సభకు ముందస్తుగా చేస్తున్న ఏర్పాట్లు, సన్నాహకాలపై రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌తో కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సమీక్షించారు.

>
మరిన్ని వార్తలు