పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఏవి? టీచర్లు లేకుండా ఇంగ్లిష్‌ పాఠాలెట్లా?

19 Jan, 2022 03:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని అమలుచేస్తే.. పేద పిల్లలకు అన్ని కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు ఉచితంగా వస్తాయని.. అది అమలుచేయకుండా సీఎం కేసీఆర్‌ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఇన్నాళ్లూ కేజీటు పీజీ అంటూ బుకాయిస్తూ వచ్చారని.. ఇప్పుడు కొత్తగా ఇంగ్లిష్‌ మీడియం కథ చెప్తున్నారని విమర్శించారు. అసలు టీచర్లే లేని పాఠశాలల్లో ఇంగ్లిష్‌ పాఠాలు ఎలా చెప్తారని నిలదీశారు.

మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. ఇప్పటికే సింగిల్‌ టీచర్‌ పాఠశాలలన్ని మూసివేసి.. మారుమూల ప్రాంతాల పేదలకు విద్యను దూరం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలంటే లెక్క లేదు కనుకనే ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేసీఆర్‌ పాల్గొనలేదని మండిపడ్డారు. పబ్బులు, బార్లతో కరోనా వ్యాపిస్తున్నా నియంత్రణ చర్యలు చేపట్టలేదేమని ప్రశ్నించారు. 

ఎస్పీకి ప్రచారమేంటి? 
ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తామని టీఆర్‌ఎస్‌ చెప్తోందని.. అంటే వారి మిత్రపక్షం ఎంఐఎంకు ద్రోహం చేస్తున్నట్టా అని రేవంత్‌ ప్రశ్నించారు. క్రిమినల్స్‌తో చర్చలు జరపబోనని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌ స్పందిస్తూ.. ‘నేను మాత్రం 420లు, క్రిమినల్స్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాను.

కేటీఆర్‌తో చర్చలు జరపాలంటే సినిమా గ్లామర్‌ ఉండాలి. అది నా దగ్గర లేదు..’అని వ్యాఖ్యానించారు. ఒక ఎంపీని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడినైన తనకు రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఉద్యోగితో రామానుజాచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం పంపారని.. జీయర్‌ స్వామి ఆశ్రమం నుంచి ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు