ఇంటికో ఉద్యోగం.. దళితులకు మూడెకరాలు ఏవి? 

31 Mar, 2022 02:19 IST|Sakshi
నాగారంలో మహిళలను ఓదార్చుతున్న షర్మిల 

నియంత పాలన పోవాలంటే కేసీఆర్‌ను గద్దె దించాలి: షర్మిల

నాగారం: ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భృతి అంటూ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సీఎం కేసీఆర్‌ను వైఎస్సార్‌ టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల నిలదీశారు. రాష్ట్రంలో నియంత పాలన పోవాలంటే కేసీఆర్‌ను గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ టీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా బుధవారం నాగారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు.

మిగులు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ పేరుతో రూ. 4 లక్షల కోట్ల అప్పులు చేసి, బార్ల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించిన ఘనత దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు.

వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి ప్రాంత వాసి ఏపూరి సోమన్నను దీవించి ఆదరించాలన్నారు. కాగా, మాటముచ్చట కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డు కునే ప్రయత్నం చేశారు. షర్మిల మాట్లాడుతున్న క్రమంలో వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు జై వైఎస్సార్‌ అంటూ నినాదాలు చేయగా అక్కడే ఉన్న కొందరు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు జై కేసీఆర్‌ అంటూ పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

మరిన్ని వార్తలు