మున్సి‘పోరు’: టీఆర్‌ఎస్‌ సరికొత్త రాజకీయం

20 Apr, 2021 02:41 IST|Sakshi

‘చివరి’లో బీ ఫామ్‌లు!

అసంతృప్తులను కట్టడి చేసేందుకు టీఆర్‌ఎస్‌ ఎత్తుగడ

‘మున్సిపల్‌’అభ్యర్థులను అధికారికంగా ప్రకటించని పార్టీ

నామినేషన్లు వేసిన ఆశావహుల్లో ఏకాభిప్రాయ సాధనకు కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లతో పాటు మరో ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి ఆదివారం నామినేషన్ల ప్రక్రియ ముగియగా, సోమవారం పరిశీలన కూడా పూర్తయింది. అయితే సిద్దిపేట మున్సిపాలిటీ మినహా ఎన్నికలు జరుగుతున్న రెండు కార్పొరేషన్లు, 4 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. కానీ డివిజన్లు, వార్డుల్లో టికెట్లు ఆశిస్తూ పెద్ద సంఖ్యలో ఆశావహులు పార్టీ పక్షాన నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్‌.. అభ్యర్థుల ప్రకటనలో ఆచి తూచి వ్యవహరించాలని భావిస్తోంది. ఈ నెల 22న ఉపసంహరణ ప్రక్రియ ముగియనుండగా.. డివిజన్లు, వార్డులవారీగా ఏకాభిప్రాయ సాధన తర్వాతే చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించి, బీ ఫామ్‌లు అందజేయాలని నిర్ణయించింది. కొన్నిచోట్ల అభ్యర్థులు ఎవరనే అంశంపై ఇప్పటికే స్పష్టత ఉన్నా, పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ నామినేషన్లు వేసిన ఇతరులు ఉపసంహరించుకున్న తర్వాతే బీ ఫామ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈలోపు అంతర్గత ప్రచారం నిర్వహించుకోవాల్సిందిగా సూచించింది.

వలసలు నివారించేందుకే..
నామినేషన్ల దాఖలు గడువుకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తే అవకాశం దక్కని ఆశావహులు ఇతర పార్టీల్లో చేరి ప్రత్యర్థులుగా నిలిచే అవకాశముందని టీఆర్‌ఎస్‌ భావించింది. కొందరు రెబల్స్‌గా మారి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగినా నష్టం జరుగుతుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడానికి కొద్ది గంటల ముందు మాత్రమే బలమైన అభ్యర్థులకు బీ ఫామ్‌లు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. వలసలకు, రెబల్స్‌కు తావులేకుండా అన్ని అస్త్రాలు ప్రయోగించడం ద్వారా ఏకాభిప్రాయ సాధన కోసం కసరత్తు జరుగుతోంది. ఒకవేళ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఎవరైనా బరిలో ఉంటే వారిపై సస్పెన్షన్‌ వేటు వేయాలని నిర్ణయించింది.

సిద్దిపేటలో కొందరు అభ్యర్థులు ఖరారు
ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రాతినిథ్యం వహిçస్తున్న సిద్దిపేట నియోజకవర్గ కేంద్రంలో 43 వార్డులు ఉండగా, నామినేషన్ల దాఖలు గడువులోగా 18 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. సోమవారం మరో ఆరుగురు అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. మిగతా వార్డుల్లోనూ ఏకాభిప్రాయం సాధించి విడతల వారీగా జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు. ఖరారైన అభ్యర్థులకు గురువారం బీ ఫామ్‌లు జారీ చేస్తామని ప్రకటించారు.

ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు
ఖమ్మం కార్పొరేషన్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌. సిద్దిపేట మున్సిపాలిటీలో మంత్రి హరీష్‌రావు, జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. అయితే వరంగల్‌ కార్పొరేషన్‌తో పాటు అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరులో మాత్రం సంబంధిత జిల్లా మంత్రుల పర్యవేక్షణలో స్థానిక ఎమ్మెల్యేలు అభ్యర్థుల జాబితాను వడపోస్తున్నారు. ఒక్కో వార్డు నుంచి సగటున ముగ్గురు చొప్పున టీఆర్‌ఎస్‌ తరఫున నామినేషన్లు వేయడంతో వారిని బుజ్జగించేందుకు సమయం పడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

>
మరిన్ని వార్తలు