హుజూరాబాద్‌: పక్కా ప్రణాళికతో ఈటలకు చెక్‌! 

5 Jun, 2021 07:20 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:  టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పిన మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు చెక్‌ పెట్టే దిశగా ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈటల రాజీనామాను స్పీకర్‌ ఆమోదించిన పక్షంలో, ఆరు నెలలలోపు హుజూరాబాద్‌ ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. కోవిడ్‌ ఉధృతి తగ్గుముఖం పడుతుందని భావిస్తున్న సమయంలో ఉపఎన్నిక నిర్ణీత గడువులోగానే పూర్తయ్యే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో నియోజకవర్గంపై ఈటల ముద్రను తుడిచేయడానికి, ఆయన ప్రాభవాన్ని తగ్గించడానికి, ఏకాకిని చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఆత్మగౌరవం కోసం రాజీనామా చేస్తున్నట్లు ఈటల ప్రకటించిన నేపథ్యంలో.. ఆత్మ గౌరవం కాదు, ఆత్మరక్షణ అన్న ట్టుగా ప్రచారం చేయాలని, ఆయన బీజేపీలో చేరడాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే యోచన లో టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఉంది. రాజీనామా చేస్తున్నట్టుగా ఈటల ప్రకటించిన వెంటనే  చోటు చేసుకున్న పరిణామాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి.  

హరీశ్‌తో గంగుల ఏకాంత చర్చలు 
శుక్రవారం ఓ వివాహానికి హాజరయ్యేందుకు కరీంనగర్‌కు వచ్చిన మంత్రి హరీశ్‌రావును కలిసిన మరో మంత్రి గంగుల కమలాకర్‌ కొద్దిసేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈటల తన రాజీనామా ప్రకటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడం ద్వారా ప్రజల్లో సానుభూతి పెరగకుండా నిరోధించడం వంటి అంశాలను చర్చించినట్లు తెలిసింది.

ఉప ఎన్నిక అనివార్యం కానున్న నేపథ్యంలో హుజూరాబాద్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నెల 11, 12 తేదీల్లో హుజూరా బాద్‌లో పర్యటించాలని నిర్ణయించారు.  కాగా, మాజీమంత్రి బస్వరాజు సారయ్య శుక్రవారం హుజూరాబాద్‌లో ఓ కులసంఘం నాయకులతో సమావేశమయ్యారు.
చదవండి: 19 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నా..

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు