ఈటలకు జరిగిన అన్యాయమేంటో చెప్పాలి: కేటీఆర్‌

14 Jul, 2021 14:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాధారణ కార్యకర్తగా ఉన్న ఈటల రాజేందర్‌కు టీఆర్‌ఎస్‌ ఏ తరహాలో ప్రాధాన్యత ఇచ్చిందో ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు అన్నారు. పార్టీలో తనకు జరిగిన అన్యాయమేంటో చెప్పాలన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో జరిగిన కార్య నిర్వాహక సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.

‘ఈటల ఓ వైపు మంత్రివర్గంలో కొనసాగుతూనే కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టారు. మంత్రివర్గం నిర్ణయాలపై ఏదైనా అసంతృప్తి ఉంటే ఏనాడైనా అసమ్మతి తెలుపుతూ డిసెంట్‌ నోట్‌ పెట్టారా?. భూముల కొనుగోలు విషయంలో తప్పు చేయకుండానే తాను భూములు సేకరించింది నిజమేనని ఒప్పుకున్నారా? కేసీఆర్‌తో తనకు ఐదేళ్లుగా గ్యాప్‌ ఉందని చెప్పిన ఈటల రాజీనామా చేయకుండా మంత్రివర్గంలో ఎందుకు కొనసాగారు? వాస్తవానికి ప్రభుత్వ పాలన, కేబినెట్‌ నిర్ణయాలు, పార్టీ విధానాలపై అనేక సందర్భాల్లో ఈటల అడ్డంగా మాట్లాడినా కేసీఆర్‌ ఆయనను మంత్రివర్గంలో కొనసాగించారు. నేను కూడా ఈటల పార్టీలో కొనసాగేలా చివరివరకు వ్యక్తిగతంగా ఎంతో ప్రయత్నం చేశా. కానీ జన్మనిచ్చిన పార్టీకి ఈటల ద్రోహం చేశారు. ఈటలపై ఎవరో అనామకుడు ఉత్తరం రాస్తేనే ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలేదు. సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే మొదట్లో శాఖ నుంచి తప్పించడంతో పాటు ఆ తర్వాత మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు.’అని కేటీఆర్‌ వివరించారు.

అక్కడ పార్టీల నడుమ పోటీ ఉంటుంది
‘ఈటల రాజేందర్‌ పార్టీలోకి రాకమునుపు కూడా నాటి కమలాపూర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ బలంగా ఉంది. ఇప్పుడు హుజూరాబాద్‌లో కూడా పార్టీ బలంగా ఉంది. ఏడేళ్లుగా హుజూరాబాద్‌లో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఈటల వ్యక్తిగతంగా ఎలా క్లెయిమ్‌ చేసుకుంటారు. హుజూరాబాద్‌లో పోటీ వ్యక్తుల నడుమ కాదు.. పార్టీల నడుమ ఉంటుంది..’అని కేటీఆర్‌ చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. జల జీవన్‌ మిషన్‌ కింద కేంద్రం అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తూ, తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదో కూడా చెప్పాలన్నారు. కొందరు ఒక్కో వారంలో ఒక్కో వ్రతం చేసినట్లు షర్మిల కూడా ఓ రోజు పెట్టుకుని వచ్చి పోతుంటారని విమర్శించారు. నీటి వాటాల విషయంలో ఏపీ సుప్రీంకోర్టును ఆశ్రయించినా న్యాయం మాత్రం తెలంగాణ వైపే ఉందన్నారు.  

మరిన్ని వార్తలు