పథకాలన్నీ బీఆర్‌ఎస్‌కు ఏటీఎంలా మారాయి: ప్రధాని మోదీ

25 Nov, 2023 15:07 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ నేడు కామారెడ్డికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇక, కామారెడ్డిలోని డిగ్రీ కాలేజీ మైదానంలో బీజేపీ బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. 

బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. పేరు మారినంత మాత్రాన వీరి బుద్ధి మారదు. యూపీఏ ఇండియా కూటమిగా మారింది. టీఆర్‌ఎస్‌ హఠాత్తుగా బీఆర్‌ఎస్‌గా మారింది. ఇండియా కూటమి అంటూ మళ్లీ మోసం చేసేందుకు జతకట్టారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వారి పిల్లల కోసం చూసుకుంటారు. బీజేపీ మాత్రం ప్రజల పిల్లల కోసం ఆలోచిస్తుంది. కేసీఆర్‌, రేవంత్‌ ఇద్దరూ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. కామారెడ్డి ప్రజలకు మంచి అవకాశం వచ్చింది. అవినీతి, కుటుంబ పాలనను ఓడించే అవకాశం వచ్చింది. ఆ ఇద్దరూ తమ నియోజకవర్గాల్లో ఓడిపోతామని తెలిసే రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో విజయ కోసం ఈ రెండు పార్టీలు కుట్రలు పన్నుతారు.’

‘బీఆర్‌ఎస్‌ నుంచి తెలంగాణకు విముక్తి లభించాలి. బీఆర్‌ఎస్‌ పాలనతో ప్రజలు విసిగిపోయారు. బీజేపీ చెప్పింది చేసి చూపిస్తుంది. వాగ్దానం ఇచ్చామంటే అది అమలై తీరుతుంది. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణే మా లక్ష్యం. మహిళల రిజర్వేషన్లు, వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌, అయోధ్య రామమందిర నిర్మాణం వంటి హామీలు నెరవేర్చాం. నిజామాబాద్‌లో పనుపు బోర్దు ఏర్పాటు చేస్తున్నాం.. గిరిజన యూనివర్సిటీ హామీని నిలబెట్టుకున్నాం. ఇచ్చిన హమీలను నిలబెట్టుకుంటున్నాం. బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. 

ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించాం. తెలంగాణలో మాదిగ సమాజానికి తీరని అన్యాయం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీని వేశాం. బీఆర్‌ఎస్‌ దళితుడిని సీఎంని చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకుంది. తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పింది. గ్యారంటీలను పూర్తి చేయడమే మోదీ గ్యారంటీ. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని మాట ఇచ్చాం. సీఎంను చేసి తీరుతాం. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బీసీల కోసం ఏం చేయలేవు. 

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెలంగాణ రైతుల కష్టాలు బీఆర్‌ఎస్‌కు పట్టడం లేదు. నీటి ప్రాజెక్టులు అవినీతితో నిండిపోయాయి. రైతుల సంక్షేమం కోసమే బీజేపీ ప్రాధాన్యతనిస్తుంది. ప్రాజెక్ట్‌ల నిర్మాణం బీఆర్‌ఎస్‌కు ఏటీఎంలా మారింది. తెలంగాణ రైతుల కోసం బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించాం. తెలంగాణ అభివృద్ధికి ఖర్చు కావాల్సిన డబ్బులు బీఆర్‌ఎస్‌ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయి.

రైతులకు అదనంగా ఆదాయం వచ్చేందుకు కృషి చేస్తున్నాం. పథకాలన్నీ బీఆర్‌ఎస్‌కు ఏటీఎంలా మారాయి. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతను బీఆర్‌ఎస్‌ మోసం చేసింది. పేపర్‌ లీకేజీలతో నిరుద్యోగ యువత దగా పడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్‌ తీరుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పేదలు ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉచిత రేషన్‌ను మరో ఐదేళ్లు ఇస్తున్నాం. ఇద్దరు ఎంపీలు ఉన్న బీజేపీని ఇప్పుడు 300 స్థానాల్లో గెలిపించి ఆశీర్వదించారు. మేము తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

మరిన్ని వార్తలు