బీజేపీలో ‘గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ’ జోష్‌

15 Jan, 2024 01:55 IST|Sakshi

ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి 

నల్లగొండ–వరంగల్‌–ఖమ్మం పట్టభద్రుల టికెట్‌ రేసులో ప్రకాశ్‌రెడ్డి, కాసం, గుజ్జుల 

సాక్షి, హైదరాబాద్‌: పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. గతేడాది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఏవీఎన్‌రెడ్డి బీజేపీ బీ–ఫామ్‌పై గెలిచి మండలిలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. త్వరలో ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకు జరిగే ఎన్నికల్లోనూ ఈ ఫలితమే పునరావృతం చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

 పట్టభద్రుల స్థానం నుంచి గెలుపునకు ఓటర్ల నమోదు కీలకం కావడంతో దానిపై దృష్టి పెట్టింది. ఇందుకోసం పాతవారితోపాటు పెద్దఎత్తున కొత్తగా డిగ్రీలు, పీజీలు పూర్తిచేసిన వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. ఓటర్ల నమోదుకు సంబంధించి పెద్దమొత్తంలో ఫామ్‌–18 దరఖాస్తులను ము ద్రించి పోలింగ్‌ బూత్‌ స్థాయి వరకు పంపాలని, ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయా లని నిర్ణయించినట్టు తెలిసింది.

ఈ స్థానానికి గత ఎన్నికల్లో పార్టీ పరంగా జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తగిన ఓట్లు దక్కని ఈ మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ సీటును గెలుచుకోవడం ద్వారా సత్తా చాటాలని నాయకత్వం యో చిస్తోంది. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే... ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో పార్టీ కి సానుకూలత పెరుగుతుందని అంచనావేస్తోంది. 

పార్టీ లో తీవ్ర పోటీ 
ఈ సీటు కోసం బీజేపీ నేతల మధ్య పోటీ కూడా తీవ్రంగానే ఉంది. ఈ టికెట్‌ను తనకు కేటాయించాలని డా.ఎస్‌.ప్రకా‹Ùరెడ్డి ఇప్పటికే నాయకత్వాన్ని కోరగా, రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌ కూడా ఈ సీటును కోరుకుంటున్నారు. గతంలో పోటీచేసి ఓడిన ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి కూడా రేసులో ఉన్నారు. వీరితోపాటు వివిధ విద్యాసంస్థల అధినేతలు, విద్యావేత్తలు కూడా బీజేపీ టికెట్‌ను కోరుకుంటున్న వారిలో ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ స్థానం నుంచి గెలుపొందిన బీఆర్‌ఎస్‌ నేత పల్లా రాజేశ్వర్‌ రెడ్డి రాజీనామాతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ స్థానానికి జూన్‌ 8 లోగా ఎన్నిక నిర్వహించాల్సి ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఓటర్ల నమోదుకు షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇందుకు ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది.

పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఫ్రెష్‌గా ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్థానం నుంచి పోటీకి ఉత్సాహం చూపుతున్న ఇతర పార్టీ ల నాయకులు సైతం ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేవారు సైతం ఈ విషయంలో తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ పట్టభద్రుల సీటుకు ఓటర్ల నమోదుకు మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావును ఇన్‌చార్జిగా నియమించారు.

>
మరిన్ని వార్తలు