నిరక్షరాస్యులు ప్రజాప్రతినిధులైతే దేశ ప్రగతి అసాధ్యం.. అరవింద్ కేజ్రీవాల్

18 Aug, 2023 07:34 IST|Sakshi

న్యూఢిల్లీ: అనకాడమీ సంస్థకు చెందిన ఒక లెక్చరర్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన విద్యార్థులతో వచ్చే ఎన్నికల్లో చదువుకున్న వారికి ఓటు వేయమని అభ్యర్ధించాడు. దీంతో ఆ సంస్థ క్లాస్‌రూమ్ వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకునే వేదిక కాదని చెబుతూ అతడిపై వేటు వేసింది. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందిస్తూ లెక్చరర్ చెప్పిన దాంట్లో తప్పేముందన్నారు.   

కరణ్ సంగ్వాన్ అనకాడమీలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ ద్వారా ఆయన తన విద్యార్థులకు ఎన్నికల్లో విద్యావంతులైన అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలని ఓ వీడియోలో కోరారు. దీంతో ఆగ్రహించిన ఆ సంస్థ సహ యజమాని రోమన్ సైనీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై వేటు వేస్తున్నట్లు ప్రకటిస్తూ X వేదికగా ట్వీట్ చేశారు.

దీనిపై సంగ్వాన్ స్పందిస్తూ.. గత కొద్ది రోజులుగా నాకు సంబంధించిన ఒక వీడియో వివాదాస్పదంగా మారింది. నా తోపాటు జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధపడుతున్న నా విద్యార్థులు కూడా ఆ వీడియో వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 19న దానిపై వివరణ ఇస్తానని వెల్లడించారు.    

సంస్థ సహ యజమాని రోమా సైనీ X వేదికగా ఏమని రాశారంటే.. మా సంస్థకు చాలా కచ్చితమైన నియమ నిబంధనలున్నాయి. విద్యార్ధులకు నిశ్పాక్షిక జ్ఞానాన్ని అందించడమే మా కర్తవ్యం.  క్లాస్‌రూమ్ అనేది వ్యక్తిగత అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకునే వేదిక కాదు. అవి విద్యార్ధులపై తప్పుడు ప్రభావం చూపుతాయి. సంస్థ నిబంధనలను ఉల్లంఘించినందుకు కారం సంగ్వాన్ ను విధుల నుండి తొలగించామని తెలియజేశారు.

ఈ ఉదంతంపై సాక్షాత్తు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందిస్తూ.. చదువుకున్న వ్యక్తికి ఓటు వేయమని అడగడం కూడా తప్పేనా? ఎవరైనా నిరక్షరాస్యులు ఉంటే వారిని నేను వ్యక్తిగతంగా గౌరవిస్తాను. కానీ ప్రజాప్రతినిధులు నిరక్షరాస్యులు కాకూడదు. ఇసి సైన్స్ అండ్ టెక్నాలజీ దూసుకెళ్తోన్న తరం. చదువురాని వారి ఆధునిక భారత దేశాన్ని నిర్మించలేరని అన్నారు.

ఇది కూడా చదవండి: నెహ్రూ గొప్పదనం ఆయన పేరులో లేదు.. రాహుల్ గాంధీ

మరిన్ని వార్తలు