అన్‌స్టాపబుల్‌గా నోటికి ఎంతొస్తే అంత! పవన్‌ మాటలు అభిమానులకైనా అర్థమవుతాయా?

7 Feb, 2023 21:23 IST|Sakshi

తెలుగుదేశం హిందుపూర్ శాసనసభ్యుడు, ప్రముఖ నటుడు బాలకృష్ణ, జనసేన అధినేత, మరో ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్అ న్‌స్టాపబుల్‌ అంటూ ఏమైనా మాట్లాడుకోనివ్వండి. ఆపకుండా నవ్వుకోనివ్వండి. ఎవరికి అభ్యంతరం లేదు. కాని మధ్యలో ప్రజలను ఉద్దేశించి , లేదా సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టింగులు చేసేవారి గురించి వాడిన భాష అభ్యంతరకరంగా ఉంది. ప్రత్యేకించి బాలకృష్ణ ఊరకుక్కల భాష వాడడం దారుణం.

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి ఎవరైనా మాట్లాడితే ఊరకుక్కలతో సమానం అట. అసలు ఊరకుక్కలు ఏమి చేస్తాయో ఆయనకు తెలుసా! వావి వరసలతో నిమిత్తం లేకుండా లైంగిక కార్యకలాపాలకు పాల్పడతాయని, రోడ్లపై ఇష్టారీతిలో సంచరిస్తాయని ఊరకుక్కలు అంటారు. ఏ రంగంలో ఎవరు ఇలా వ్యవహరిస్తారో ఇలాంటి చెత్త పనులు ఎక్కువగా చేస్తారో చెప్పుకుంటే సిగ్గుపోతుంది. మనకు సభ్యత అడ్డువస్తుంది. కాని అలాంటి వాటితో నిమిత్తం లేని వారు ఏమైనా మాట్లాడగలరు. 

గతంలో ఇదే బాలకృష్ణ ఏమన్నారు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి. లేక... చేయాలి అని అన్నారు. ఆక్షేపణీయపు భాష వాడడం ఇష్టం లేక డాట్ లు పెట్టాల్సి వచ్చింది. ఆడపిల్లల తండ్రి ఎవరైనా ఇలా మాట్లాడతారా? అంతేకాదు .. సినిమాలలో డబుల్ మీనింగ్ డైలాగులు, అర్ధనగ్న నృత్యాలు, అబ్జెక్షనబుల్ సన్నివేశాలు ఎన్ని కనిపిస్తుంటాయో, వాటిపై అప్పుడప్పుడు మహిళా సంఘాలు ఎందుకు  ఆందోళనలు చేస్తుంటాయో.. ఇవేవి ప్రజలకు తెలియవా?

కేవలం మూడు పెళ్లిళ్లు అని ప్రస్తావిస్తేనే ఊరకుక్కలతో సమానం అయితే పైన చెప్పినవాటిని ఏ మాత్రం సిగ్గుపడకుండా చేసేవారిని ఏమనవలసి వస్తుంది. తన ఇంటిలోనే ఇద్దరిపై కాల్పులు జరిపినవారిని ఏమనాలి? సినిమాలతో పాటు రాజకీయాలలో ఉన్నవారు ఎంత బాధ్యతగా మాట్లాడాలి. సమాజంలో ఎంతో కొంత ప్రభావం చూపే వ్యక్తులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే వారి అభిమానులు కూడా ఇలాగే తయారవ్వరా? 

సడన్ గా బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ పై రాజకీయ అవసరాల రీత్యా అభిమానం ఏర్పడవచ్చు. అంతకుముందు జనసేనవారిని ఉద్దేశించి అలగాజనం అని, మరొకటి అని అన్నా, పవన్ కళ్యాణ్ పెద్దగా ఫీల్ కాకపోతే అది ఆయన ఇష్టం. కాని ఆయన మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడితే ఊరకుక్కలతో సమానం అంటే మాత్రం కచ్చితంగా చాలామంది బాదపడతారు. దానిపై అదే స్థాయిలో స్పందిస్తుంటారు. అందువల్లే సోషల్ మీడియాలో బాలకృష్ణపై విమర్శలు వెల్లువెత్తున్నాయట.

పవన్ కు బాలకృష్ణ సర్టిఫికెట్ ఇచ్చేస్తే జనం ఒప్పేసుకోవాలా! ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూసినా చిత్రంగానే ఉంటాయి. అసలు ఇలాంటి ప్రశ్నలను అవాయిడ్ చేయవచ్చు. అయినా వారిద్దరూ కావాలని  మాట్లాడుకున్నారు. తద్వారా అదేదో మూడు పెళ్లిళ్లు చేసుకోవడం తప్పుకాదు.. అది చాలా చిన్న విషయం అన్నట్లుగా వీరి సంభాషణ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు కొత్త సంగతులు చెబుతుంటారు. వాటిలో నిజం ఉందో లేదో ఎవరికి అర్ధం కాదు. 

ఈసారి ఏకంగా ఆయన బ్రహ్మచారిగా ఉండాలని అనుకున్నానని, యోగ మార్గాన్ని అనుసరించాలని అనుకున్నా అని ఆయన చెప్పారు. కాని, మూడు సార్లు పెళ్లి  జరిగింది తనకేనా అనిపిస్తుందట. ఒకేసారి ముగ్గురిని పెళ్లి చేసుకోలేదని, ముగ్గురితో ఒకేసారి ఉండ లేదని ఆయన అంటూ పెళ్లిళ్లకు కారణాలు చెప్పారు. కాని ఇక్కడ కూడా ఆయన నిజం చెప్పలేకపోయారు. ఆయన యోగి అవుతాననుకున్నది నిజమా? కాదా అన్నది మనకు అనవసరం.  

ఒక పెళ్లి చేసుకుని మరో మహిళతో సహజీవనం చేశారన్నది ఆయనపై కొందరు చేసే అబియోగం. అది వాస్తవమా? కాదా? అన్నదానిపై ఆయన క్లారిటీ ఇస్తే ఆయనలోని నిజాయితీ ప్రజలకు కాకపోయినా, అభిమానులకు అయినా అర్దం అయ్యేది. విడాకులు ఇచ్చి పెళ్లిళ్లు చేసుకోవడం తప్పుకాదు. ఆయన అన్నది అంతవరకు వాస్తవమే. కాని అలా చేయలేదన్నది ఆయన ప్రత్యర్ధులు చేసే ఆరోపణ. 

ఇక పవన్ కళ్యాణ్ కొందరు విశిష్ట వ్యక్తుల పేర్లు ప్రస్తావిస్తూ, అంబేద్కర్, పూలె, తరిమెల నాగిరెడ్డి, రామ్ మనోహర్ లోహియా వంటివారు రచించిన పుస్తకాలు చదివానని అంటారు. ఏదైనా సందేహం తీర్చుకోవాలంటే ఆ పుస్తకాలపై ఆధారపడతారట. అసలు వారు రాసిననాటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు సంబంధం ఉందా? 

2009లో ప్రజారాజ్యం, 2014 లో జనసేనను స్థాపించి టిడిపి, బిజెపిలకు మద్దతు ఇవ్వడం, 2019లో బిఎస్పి, వామపక్షాలతో కలిసి పోటీచేయడం, తదుపరి బిజెపివారిని బతిమలాడుకుని పొత్తు పెట్టుకోవడం. వీటన్నిటిలో  ఆ ప్రముఖుల పుస్తకాలతో ఏమి సంబంధం. పాపం.. ఆ మహనీయులు జీవించి ఉంటే ఎంత క్షోభ పడేవారో! ఏదో ఒకటి చెప్పి తానేదో గొప్ప చదువరిని అని ప్రొజెక్టు చేసుకోవడం తప్ప మరొకటి కాదు. 

సిపిఐ సీనియర్ నేత  చంద్రశేఖర్  టీవీలలో ఒక వ్యాఖ్య చేసేవారు. పవన్ కళ్యాణ్ ఎనభైవేల పుస్తకాలు చదవలేదని, వాటి అట్టలను మాత్రమే చూసి ఉంటారని పేర్కొన్నారు. మరి ఎవరు కరెక్టో వారే చెప్పాలి. అయితే ఒకటి మాత్రం వాస్తవం. తనకు త్రివిక్రమ్ శ్రీనివాస్  గురువు వంటివారని, ఆయనతో ఆయా అంశాలతో చర్చిస్తానని అన్నారు. 

ఏమి చర్చిస్తారో తెలియదు కాని, పవన్ కళ్యాణ్ ఆయన రాసిచ్చే డైలాగులనే సభలలో వాడుతుంటారని అంతా చెబుతుంటారు. కొంతలో కొంత ఇదైనా నిజం చెప్పినందుకు సంతోషించాలి. ఇలాంటి అన్ స్టాపబుల్  కార్యక్రమాలతో ఒటిటికి ఏమైనా లాభం కొంత ఉండవచ్చేమో కాని, రాజకీయంగా ప్రయోజనం అంతంతమాత్రమే అని చెప్పాలి.
-హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. 

మరిన్ని వార్తలు