కేసీఆర్ కాళ్లు బరాబర్ మొక్కుతా: మంత్రి

29 Jan, 2021 17:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తండ్రి వయసున్న సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. బండి సంజయ్, ఎంపీ అర్వింద్‌లపై మండిపడ్డ మంత్రి.. వీరిద్దరూ తమ పరిధి దాటి మాట్లాడొద్దని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్ ప్రభుత్వం పని తీరుపై సంజయ్‌, అర్వింద్‌ ఎప్పుడూ తప్పుడు ప్రచారాలే చేస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో తొమ్మిది కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల ప్రారభోత్సవ కార్యక్రమాల్లో శుక్రవారం మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 2016 రూపాయల పెన్షన్‌లో కేంద్రంలోని బీజేపీ రెండువందలకు మించి ఒక్కరూపాయి ఎక్కువ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఎక్కువ ఇస్తున్నట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే ఎంపీ పదవికి అరవింద్ రాజీనామా చేస్తారా అని సవాలు విసిరారు. చదవండి: రైతు పిల్లలను ఎంకరేజ్ చేయాలి: హరీశ్‌ రావు

గృహ నిర్మాణాల కోసం కేసీఆర్ ప్రభుత్వం 4 లక్షల 32 వేలు ఇస్తుంటే కేంద్రం ఇచ్చేది కేవలం 72 వేలు మాత్రమే అని చెప్పుకొచ్చారు. కల్యాణ లక్ష్మీ డబ్బులలో ఒక్క రూపాయి కుడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం లేదని స్పష్టం చేశారు. సీఎంఆర్ఎఫ్ లాగా పీఎం ఆర్ఎఫ్ కూడా ఉంటుందని అందులోంచి పేదల హాస్పిటల్ ఖర్చులకు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. నిజంగా తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉన్నా, పౌరుషం ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించి, కేంద్రం నుంచి నిధులు తెప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కన్న కొడుకులాగా చూసుకుంటాడు కాబట్టే తండ్రి సమానమైన కేసీఆర్ కాళ్లు బరాబర్ మొక్కుతానని మంత్రి పేర్కొన్నారు. ఒక్కసారి కాదు అనేక సార్లు మొక్కుతా అని చెప్పుకొచ్చారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడాలే తప్ప, సంస్కార హీనులుగా మాట్లాడొద్దని బండి సంజయ్, ఎంపీ అర్వింద్‌లకు సూచించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు