అక్కడ చంద్రబాబే నిప్పు రాజేస్తున్నారా..?

30 Apr, 2023 20:49 IST|Sakshi

ఆ నియోజకవర్గ టీడీపీలో చంద్రబాబే నిప్పు రాజేస్తున్నారా..? వచ్చే ఎన్నికల్లో టికెట్ నీకే అంటూ ఆ ఇద్దరి నేతలని ఆయన మభ్యపెడుతున్నారా? గత ఎన్నికల్లో ఆ నియోజక వర్గంలో టీడీపీ గల్లంతు అయినా.. చంద్రబాబు వ్యవహార శైలి మారకపోవడంపై అక్కడి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏదా నియోజక వర్గం..? ఆ ఇద్దరు నేతలు ఎవరు..?

గత అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ అడ్రస్ గల్లంతయింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ ఘోరంగా ఓడిపోయారు.ఓటమిని జీర్ణించుకోలేని కురుగొండ్ల రామకృష్ణ తట్టా బుట్టా సర్దుకుని చెన్నైకు వెళ్ళిపోయారు. దీంతో టీడీపీ క్యాడర్‌లో తీవ్ర నిరాశ నెలకొంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకే టికెట్ దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో పాటు.. మరో బీసీ నేత మస్తాన్ యాదవ్ ఎవరికివారే చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు తమకే మాట ఇచ్చారని ఇద్దరు నేతలూ చెప్పుకుంటున్నారు. 

2009.. 2014 ఎన్నికల్లో టీడీపీ తరవున పోటీచేసి గెలుపొందారు కురుగొండ్ల రామకృష్ణ. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చెన్నైలో వ్యాపారాలపై దృష్టి పెట్టారు కురుగొండ్ల. సమయం దొరికినప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ కేడర్‌ కలుస్తున్నారు. కురుగొండ్లకు టికెట్ ఇస్తే.. వెంకటగిరిలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని ఆయన వ్యతిరేక వర్గంవారు ప్రచారం చేస్తున్నారు.  

ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనపై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయని గుర్తుచేస్తున్నారు. కాంట్రాక్టర్లను బెదిరించడం, ఎర్రచందనం అక్రమ రవాణా, తనకు అనుకూలంగా వ్యవహరించని అధికారులపై విరుచుకుపడటంలాంటి  కురుగొండ్ల వ్యవహార శైలిని వ్యతిరేకవర్గంవారు ప్రస్తావిస్తున్నారు. నెల్లూరు జడ్పీ ఎన్నికలలో ఏకంగా కలెక్టర్‌పైనే దాడికి ప్రయత్నించడం.. మైకు విసిరేసి..ఎన్నికలకు సంబంధించిన పత్రాలను చించేయడం లాంటి వ్యవహారాలతో చెడ్డ పేరు తెచ్చుకున్నారనీ వ్యతిరేక వర్గం నేతలు చెబుతున్నారు. పార్టీ కంటే సొంతప్రయోజనాల కే  కురుగొండ్ల ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారని సొంతపార్టీ నేతలే విమర్శిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో రామకృష్ణకు టికెట్ ఇస్తే పార్టీ గెలుపు అంత సులువుకాదని చాలామంది నేతలు.. టీడీపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారట.రామకృష్ణకు టికెట్ వచ్చే అవకాశం లేదని.. కొత్త అభ్యర్థిని రంగం లోకి దించుతామని అధిష్టానమే చెప్పిందని కురుగొండ్ల వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. మరోవైపు.. హైదరాబాదులో డాక్టర్‌గా ఉన్న మస్తాన్ యాదవ్ ఈసారి వెంకటగిరి నుంచి ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నారట.
చదవండి: బాబు, పవన్‌లపై లెఫ్ట్‌ నేతల ఆగ్రహానికి కారణం ఏంటి?

వెంకటగిరికి స్థానికుడు కావడం.. తనకు అవకాశం ఇప్పించాలని.. హై రికమెండేషన్‌తో చంద్రబాబు ను సైతం కలిశారట మస్తాన్ యాదవ్. ‘‘తమ్ముడూ.. గో హెడ్ అని’’ చంద్రబాబు తనకు హామీ ఇచ్చినట్టు మస్తాన్ యాదవ్ తన అనుచరులు దగ్గర చెప్పుకుంటున్నారు.  2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ నిస్తేజంగా మారింది. దీనికితోడు రామకృష్ణ, మస్తాన్ యాదవ్ మధ్య మరింత అగాథాన్ని పెంచింది చంద్రబాబేనని టీడీపీ క్యాడరే చర్చించుకుంటోంది. టికెట్‌పై  చంద్రబాబు హామీ ఇచ్చారని ఇద్దరు నేతలు బహిరంగంగా చెప్పుకోవడంతో క్యాడర్ అయోమయంలో పడిందంటున్నారు టీడీపీ నేతలు.  

చంద్రబాబు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడంపై కూడా అంతర్గత సమావేశాల్లో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టిక్కెట్ గనక మరోసారి కురుగొండ్లకిస్తే  టీడీపీ ఓడిపోవడం ఖాయమని.. అలా కాదని కొత్తవారికి అవకాశమిస్తే క్యాడర్ మొత్తం వైసీపీలోకి వెళ్లే ఛాన్స్ ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మొత్తానికి చంద్రబాబు రాజకీయం వెంకటగిరి టీడీపీలో  రచ్చ రచ్చగా మారింది.
చదవండి: జగజ్జనని చిట్‌ ఫండ్స్‌.. ఆదిరెడ్డి అప్పారావు, వాసు అరెస్ట్‌ 

మరిన్ని వార్తలు