స్వేచ్ఛగా బద్వేలు ఉప ఎన్నిక

28 Oct, 2021 04:42 IST|Sakshi

అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ ఆదేశం 

బద్వేలులో ముగిసిన ప్రచారం  

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించిన అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి ఎన్నికల ప్రచారాన్ని అన్ని రాజకీయ పార్టీలు నిలిపేసినట్లు తెలిపారు.

ఎన్నికకు 12 గంటల ముందుగానే నియోజకవర్గం సరిహద్దులన్నీ మూసేయాలని, నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలు మినహా ఇతర వాహనాలను అనుమతించొద్దని ఆదేశించారు. 28వ తేదీ సాయంత్రం 7 నుంచి 30 వ తేదీ రాత్రి 10 గంటల వరకూ, ఓట్ల లెక్కింపు రోజైన నవంబర్‌2న మద్యం షాపులను మూసేయాలన్నారు. 30న నియోజకవర్గంలో అన్ని కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. 

హుజూరాబాద్‌లో ముగిసిన ప్రచార హోరు  
తెలంగాణలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. 30న ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు జరుగనుంది. అధికార టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతోపాటు కొందరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ఎన్నిక కోసం.. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా దాదాపు నాలుగు నెలలపాటు ప్రచార పర్వం సాగింది.

మరిన్ని వార్తలు