అంతర్వేది వ్యవహారంలో బాబు హస్తం: విజయసాయిరెడ్డి

11 Sep, 2020 11:54 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం దగ్ధమైన ఘటన వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరుల హస్తం ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ప్రవాస అంద్రుడిలా హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్రంలో అలజడి సృష్టించాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరామని, త్వరలోనే చినబాబు, పెదబాబు హస్తం బయటపడుతుందంటూ చంద్రబాబు, నారా లోకేశ్‌లను ఉద్దేశించి విమర్శించారు. అంతర్వేదిలో గలాటా సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగాయని ప్రచారం చేయాలనుకున్నారని మండిపడ్డారు. ఈ ఘటనలో గుంటూరు, హైదరాబాద్‌ వ్యక్తుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారని తెలిపారు. స్థానికంగా శుక్రవారం జరిగిన‘మన ఆరోగ్యం మన చేతుల్లోనే’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ప్రకటనతో ఇక్కడి భూములకు ధరలు పెరిగాయన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనల్లో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.(చదవండి: అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు)

మతాల పేరిట విధ్వంసం: మంత్రి అవంతి
అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు సీఎం ఆదేశించడం సంతోషకరమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో మతాల పేరిట విధ్వంసం సృష్టించే యత్నం కొన్ని పార్టీలు చేస్తున్నాయని ఆరోపించారు. రాజధాని అంశం రాష్ట్రాల పరిధిలోనే ఉందని  కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. చంద్రబాబు ట్రాప్‌లో పడి పవన్ కళ్యాణ్ అమరావతిపై ప్రేమ కనబరుస్తున్నారని అన్నారు. 13 జిల్లాల ప్రజలు కలిసి ఉండాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రతిపాదన చేసినట్టు చెప్పారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ జూమ్ ద్వారా ప్రజలలో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.

కాగా ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎన్వీవి సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ సత్యవతి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, అదీప్ రాజు, తిప్పల నాగిరెడ్డి, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, నార్త్ కన్వీనర్ కేకే రాజు, నగర కన్వీనర్ వంశీ కృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు