టీడీపీలో ‘గంటా’ టెన్షన్

8 Feb, 2021 05:00 IST|Sakshi

చంద్రబాబుకి చెప్పకుండానే రాజీనామా

సొంతంగా ఉద్యమానికి రెడీ

అయోమయంలో మిగిలిన నేతలు 

సాక్షి, అమరావతి: విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా టీడీపీలో కాక రేపుతోంది. తమది అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకునే టీడీపీలో కనీసం అధినేతకు తెలియకుండా ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీతో సంబంధం లేకుండా రాజీనామా చేసిన గంటా విశాఖ ఉక్కు ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తానని, జేఏసీ కూడా ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. పార్టీకి చెప్పకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని పలువురు విశాఖ నాయకులు ప్రశ్నించినా గంటా పట్టించుకోలేదని చెబుతున్నారు. విశాఖలో మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలున్నారు.

వీరిలో వాసుపల్లి గణేష్‌బాబు టీడీపీకి దూరంగా ఉంటుండగా వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు పార్టీలో కీలకంగా ఉన్నారు. గంటా ఆకస్మిక రాజీనామాతో పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది. పార్టీపరంగా పోరాటం చేద్దామని, సరైన సమయంలో నిర్ణయం చెబుతానని, అప్పటివరకూ ఆగాలని అంతకుముందు చంద్రబాబు కోరినా గంటా పట్టించుకోలేదని చెబుతున్నారు. రెండేళ్లుగా గంటా పార్టీ కార్యకలాపాలు, సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు నిర్వహించే సమావేశాలకు హాజరు కావడంలేదు. అసెంబ్లీ సమావేశాల్లో సైతం పాల్గొనడం లేదు.  

మరిన్ని వార్తలు