వరంగల్ తూర్పులో టీఆర్‌ఎస్‌కు తప్పని తలనొప్పి.. పాలకుర్తిలో మంత్రికి కొండాతో గండం!

6 Sep, 2022 13:31 IST|Sakshi

ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రస్తుతం టిఆర్ఎస్ కోటగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఒంటెద్దు పోకడతో గులాబీ గూటిలో ముసలం పుట్టి గ్రూప్ రాజకీయాలతో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. 

అధికార పార్టీ లోని గ్రూప్ రాజకీయాలను అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మూడున్నరేళ్ళలో మారిన పరిణామాల కారణంగా.. నన్నపనేని నరేందర్ కి పోటీగా బస్వరాజ్ సారయ్య, గుండు సుధారాణి రేస్‌లో వుండే అవకాశం లేకపోలేదు. ఒకరంటే ఒకరికి పడక వర్గపోరు తీవ్రం అవుతుండడంతో టిఆర్ఎస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇటీవల పార్టీని వీడటం మరో ఇబ్బంది.

సురేఖకు అదే ప్లస్‌!
కాంగ్రెస్ పార్టీ నుండి ప్రస్తుతానికి కొండా సురేఖ ఒక్కరే పోటీలో కనిపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పద్మశాలి సామాజికవర్గం ఓట్లు ఎక్కువ ఉండడం కొండా సురేఖకి కలిసివచ్చే అంశం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం పాలయింది.‌వరంగల్ తూర్పుతో పాటు పరకాల, పాలకుర్తి నియోజకవర్గాలు తమ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కొండా ఫ్యామిలీ కోరుతున్నట్లు తెలుస్తోంది. 

ప్రభుత్వ వ్యతిరేకత, టిఆర్ఎస్ లో వర్గ పోరు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 4 వేల ఓట్లకు పరిమితమైన బీజేపీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 45 వేల ఓట్ బ్యాంక్ సాధించుకోగలిగింది. తూర్పు ప్రజలు బీజేపీకి కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ సరైన నాయకత్వం లేకపోవడం ఆ పార్టీకి మైనస్ పాయింట్ గా మారింది. అయితే ఇది పూర్తిగా అర్బన్ ప్రాంతం కనుక బీజేపీకి కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు.

రంగంలో కొండా?
పాలకుర్తి నియోజకవర్గం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు కంచుకోట. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యే గా దయాకర్ రావు ను దీవించడం నియోజకవర్గ ప్రజలకు పరిపాటిగా మారింది. విపక్ష అభ్యర్థుల బలహీనతలను అనుకూలంగా మార్చుకుని ఎర్రబెల్లి జయకేతనం ఎగురవేస్తున్నారు. దయాకర్ రావును ఢీకొట్టే సరైన నాయకుడు ఇతర పార్టీల్లో లేకపోవడం ఆయనకు కలిసోస్తుందనే అభిప్రాయం వ్యక్త మవుతుంది. 

కానీ రాబోయే ఎన్నికల్లో మంత్రికి చుక్కలు చూపేందుకు రాజకీయ ప్రత్యర్ధి కొండా మురళి కాంగ్రెస్‌నుంచి బరిలో దిగుతారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ నుండి గత ఎన్నికల్లో పెదగోని సోమయ్య పోటీ చేసి ఓడిపోయారు. ఎర్రబెల్లి సుధాకర్ రావు , యతిరాజారావు కుటుంబం నుండి ఒకరు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎవరు పోటీ చేసినా బీజేపీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు.

మరిన్ని వార్తలు