విషాదం.. కొడుకును నడుముకు కట్టుకుని.. చెరువులో దూకిన తల్లి

6 Sep, 2022 13:44 IST|Sakshi
శివతేజ (ఫైల్‌)

సాక్షి, సిద్దిపేట: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత కుమారుడితో సహా చెరువులో దూకింది. కుమారుడు మృతి చెందగా, తల్లి ప్రాణాలతో బయటపడింది. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాలలో సోమవారం జరిగింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామానికి చెందిన చింతల స్వాతికి ముస్తాబాద్‌ మండలం బదనకల్‌కు చెందిన శరత్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు శివతేజ(3) ఉన్నాడు.

కుటుంబ కలహాలతో ఏడాదిగా తల్లిదండ్రుల వద్ద మల్యాలలో ఉంటున్న స్వాతి, సిద్దిపేటలోని ఓ షోరూంలో పని చేస్తోంది. అయినా కొద్ది రోజులుగా శరత్‌ వేధింపులకు గురిచేస్తుండడంతో మనస్తాపం చెందింది. కుమారుడిని నడుముకు కట్టుకొని గ్రామంలోని చెరువులో దూకింది. గమనించిన గొర్రెల కాపరులు చెరువులో నుంచి ఇద్దరిని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే కుమారుడు శివతేజ మృతిచెందాడు. తానూ ప్రాణాలు తీసుకోవాలనుకుంటే తన కుమారుడు చనిపోయాడని, అందుకు కారణమైన భర్తపై చర్యలు తీసుకోవాలని స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
చదవండి: Khammam: తొలి తరం కమ్యూనిస్టు నేత భూపతిరావు మృతి

మరిన్ని వార్తలు