Bengaluru Rains: వరద నీటిలో స్కూటీ స్కిడ్‌.. కరెంట్‌ స్తంభం పట్టుకోవడంతో

6 Sep, 2022 13:20 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వానలతో ఐటీ కారిడార్‌ సహా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటితో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ జామ్‌తో వాహనాల రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాల కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచొట్ల ఊహించని ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి.

తాజాగా రోడ్డుపై వెళుతోన్న ఓ యువతి ప్రమాదవశాత్తూ కరెంట్‌ షాక్‌ తగిలి అక్కడిక్కడే మృతువ్యవాత పడింది. ఈ విషాద ఘటన బెంగళూరు నగరంలోని వైట్‌ఫీల్డ్‌ సమీపంలో సోమవారం రాత్రి 9.30 నిమిషాలకు చోటుచేసుకుంది. 23 ఏళ్ల అఖిల అనే యువతి పాఠశాలలో ఆడ్మినిస్ట్రేటివ్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుంది. విధులు నిర్వహించుకొని రాత్రి స్కూల్‌ నుంచి తన స్కూటీపై ఇంటికి బయల్దేరింది. ఈ క్రమంలో వరద నీటితో నిండిన రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా స్కూటీ స్కిడ్‌ అయ్యింది.
చదవండి: ఎంత పనైపాయే.. స్కెచ్‌ ఒకరికి.. మర్డర్‌ మరొకరిని.. 

దీంతో యువతి కిందపడకుండా ఉండేందుకు పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే అదే స్తంభానికి కరెంట్‌ పాస్‌ అవుతుండటంతో షాక్‌ తగిలి కిందపడిపోయింది. దీనిని గమనించిన స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా బెంగళూరులో విద్యుత్‌ అధికారులు, మున్సిపల్‌ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని.. తన కూతురు చావుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు