అమిత్‌ షా రాజీనామా చేయాలి

11 Apr, 2021 04:39 IST|Sakshi

మమతా బెనర్జీ డిమాండ్‌

బదూరియా/హింగల్‌గంజ్‌: కూచ్‌బెహార్‌ జిల్లాలో కేంద్ర బలగాల కాల్పులు జరపడాన్ని పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఖండించారు. ఈ ఘటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా బాధ్యత వహించాలని, వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆమె శనివారం బదూరియాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ప్రజలపై కాల్పులు జరపడం హేయమైన చర్య అని అన్నారు. ఓట్లు వేసేందుకు వరుసలో నిల్చున్నవారిపై అన్యాయంగా తుపాకులు ఎక్కుపెట్టారని చెప్పారు.

కూచ్‌బెహార్‌ ఘటనకు నిరసనగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నల్లబ్యాడ్జీలు ధరించి, శాంతియుతంగా నిరసన తెలపాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమిత్‌ షా పన్నిన కుట్రలో భాగంగానే కేంద్ర బలగాలు కాల్పులు జరిపాయని మమత ఆరోపించారు. కూచ్‌బెహార్‌ జిల్లాలో కాల్పుల ఘటన వెనుక ఉన్న అసలు నిజాలను బయటపెట్టేందుకు సీఐడీ విచారణ జరిపిస్తామని అన్నారు. కేంద్ర భద్రతా బలగాలపై చేసిన వ్యాఖ్యలను మమత సమర్థించుకున్నారు. కేంద్ర బలగాలపై తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు.

ఏప్రిల్‌ 6న ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసుపై ఆమె శనివారం స్పందించారు. బెంగాల్‌లో విధుల్లో ఉన్న కేంద్ర బలగాల వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు. నోటీసును ఉపసంహరించుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఏప్రిల్‌ 6న తెల్లవారుజామున రామ్‌నగర్‌లో తారకేశ్వర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఓ బాలికను వేధించినట్లు కేసులు నమోదయ్యిందని తెలిపారు. ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు.  కూచ్‌బెహార్‌ ఘటన వెనుక ముందస్తు ప్రణాళిక ఉందని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. కాల్పుల వీడియో ఫుటేజీని బయట పెట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. మృతుల కుటుంబాలను మమత పరామర్శిస్తారని చెప్పారు.

మరిన్ని వార్తలు