​​​​​​​బెంగాల్‌ రాజకీయాల్లో కీలక అంశం ఇదే!

22 Mar, 2021 16:36 IST|Sakshi

ఓబీసీలపై రాజకీయ పార్టీల నజర్

 బెంగాల్‌ రాజకీయాల్లో కీలకంగా మారిన ఓబీసీ అంశం

మేనిఫెస్టోల్లో ఓబీసీల్లో నూతన కులాల చేరికలపై ప్రస్తావనలు

సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెంగాల్‌ను కుల రాజకీయాలు, సమీకరణాలే శాసిస్తున్నాయి. అభివృద్ధి మంత్రం జపించాల్సిన స్థానంలో రాజకీయపార్టీలు కుల సమీకరణాలే లక్ష్యంగా ప్రజలను మచ్చికచేసుకొనే పనిలో బిజీగా ఉన్నాయి. ఇన్నేళ్లుగా కుల రాజకీయాలకు దూరంగా ఉన్న బెంగాల్‌లో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కులమే రాజకీయ పార్టీలకు ప్రధానాస్త్రంగా మారింది. అధికార పీఠాన్ని వదులుకోవడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వరాదనే ఉద్దేశంతో వ్యూహాలు రచిస్తున్న టీఎంసీ ఒకవైపు, ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగాల్‌ కోటలో కమలాన్ని వికసింపచేయాలని ఉవ్విళ్లూరుతున్న కమలదళం మరోవైపు కుల సమీకరణాలపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. 

మేనిఫెస్టోల్లో ఓబీసీ అంశం 
బెంగాల్‌ అసెంబ్లీలో 50కి పైగా స్థానాల్లో కీలకంగా ఉన్న ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)ను తమకు అనుకూలంగా మార్చుకొని ఎన్నికల్లో లబ్ధిపొందాలని బీజేపీ, టీఎంసీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత బుధవారం విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలో మహిషి–తేలి, సాహా వంటి కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు మంజూరు చేయాలనే నిర్ణయం ఆయా వర్గాలను తమ వైపు తిప్పుకొనేందుకు చేసిన ఒక కీలక పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ చదరంగంలో తృణమూల్‌ ఆడిన ఈ పందెంతో కమలదళం సైతం పావులు కదిపింది. మూడు, నాలుగు రోజుల క్రితం బెంగాల్‌లో పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దీదీని విమర్శించారు. కొన్నేళ్లుగా ఓబీసీ కేటగిరీలో చేర్చేందుకు టీఎంసీ అడ్డుకుంటున్న కొన్ని కులాలను బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేరుస్తామని నడ్డా హామీ ఇచ్చారు. తాజాగా విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోలో మండల్‌ కమిషన్‌ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని మహిష్య, తిల్లి, ఇతర హిందూ ఓబీసీ కులాలను ఓబీపీ రిజర్వేషన్‌లో చేరుస్తామని ప్రకటించింది. 

టీఎంసీ కంచుకోటగా పరిగణించే ఉత్తర 24 పరగణాలు, నాడియా జిల్లాలతో సహా దక్షిణ బెంగాల్‌లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ జనాభా ఉన్న జంగల్‌మహల్‌ జిల్లాల్లో 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కమలదళం క్షేత్రస్థాయిలో తమ వ్యూహాలను అమలు చేసి విజయం సాధించింది. అయితే బీజేపీకి 2019 సార్వత్రిక ఎన్నికలు కలిసిరావడానికి ప్రధాన కారణం ఓబీసీ ఓట్ల బదిలీ. వాస్తవానికి తూర్పు– పశ్చిమ మేదినీపూర్, హుగ్లీ, హౌరా జిల్లాల్లో బీజేపీ పట్టుపెంచుకుంది. దీంతో ఈ జిల్లాల్లోని ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ బల నిరూపణకు కలసివస్తాయని బీజేపీ పెద్దలు ఉవ్విళూరుతున్నారు. అదే సమయం లో తాయిలాలను ప్రకటించి తిరిగి అధాకారంలోకి రావాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ భావిస్తోంది.  

ఇతర వర్గాలపై కన్ను: చాలాకాలంగా తృణమూల్‌ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న మతువా, ఆదివాసీ, రాజవంశీ, బౌరి, బాగ్డి వంటి కులాల ప్రజలకు తాయిలాలు ప్రకటించడం ద్వారా మచ్చిక చేసుకొనేందుకు మమతా బెనర్జీ ఒకవైపు ప్రయత్నిస్తుంటే, మరోవైపు బీజేపీ నాయకులు కూడా ఈ వర్గాలను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా రాజవంశీలు, మతువాలపై కమలదళం ప్రత్యేక దృష్టిపెట్టింది. మతువాలకు సంబంధించి అనేక అంశాల్లో కీలక ప్రకటనలు చేయడంతో పాటు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని అమలు చేసే ప్రక్రియపై కమలనాథులు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. మతువా సామాజిక వర్గం తీర్థస్థలంగా భావించే ప్రాంతాన్ని మోడీ సందర్శించనున్నారు. 

బెంగాల్‌లో ఈ నెల 27న జరిగే తొలిదశ ఓటింగ్‌ ప్రక్రియతో మొత్తం ఎనిమిది దశల పోలిం గ్‌ ప్రక్రియ ప్రారంభమౌతుంది. అయితే తొలిదశ పోలింగ్‌కు ఒక్కరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న బంగ్లాదేశ్‌కు వెళుతున్నారు. ఆ మరుసటి రోజు 27వ తేదీన మతువా సామాజిక వర్గం దైవంగా కొలిచే హరిచంద్‌ ఠాకూర్‌ జన్మస్థలం, మతువాలకు తీర్థస్థలం అయిన గుడాకాం దీని సందర్శిస్తారు. ప్రధాని మోదీ ఈ పర్యటనపై కమలదళం పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని సందర్శించే తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ నిలువనున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5 కోట్లకు పైగా మతువా వర్గ ప్రజల మనసుల్లో మోదీ చోటు సంపాదించుకున్నవారు అవుతారని బీజేపీ నాయకత్వం, మతువా మహాసంఘ్‌ నాయకులు భావిస్తున్నారు.

  

50 సీట్లపై ప్రభావం 
2011లో తొలిసారి అధికారంలోకి వచ్చిన ఏడాదికి బెంగాల్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ బిల్లు–2012ను తీసుకొచ్చారు. ఈ జాబితాలో ముస్లింలలోని సయ్యద్, సిద్దిఖీ వర్గాలు మినహా మిగతా అందరినీ తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేర్చింది. హిందువుల్లో సూత్రధర్, స్వర్ణకర్, తేలి, కుంభకర, కుర్మి, మంజి, మోదక్, కన్సారీ, కహార్, మిడాస్, కపాలి, కర్మకర్‌లను కూడా ఓబీసీ కులాల్లోకి చేర్చారు. వాస్తవానికి రాష్ట్రంలోని 50 సీట్లపై మహిష, తోమర్, తేలి కులాలు తమదైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 38 లక్షల మందికి బెంగాల్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఓబీసీ ధృవీకరణ పత్రాలను జారీచేసిందని సమాచారం. ఇదేకాకుండా ఇటీవల ఒక ప్రభుత్వ పథకం కింద వేలాదిమందిని ఓబీసీలుగా గుర్తించేందుకు నమోదు ప్రక్రియను మమతా ప్రభుత్వం చేసిందని అనధికార వర్గాల సమాచారం.  

చదవండి:

నేనో పెద్ద గాడిదనని.. అతడి అసలు రంగును గుర్తించలేకపోయా: మమత


పరాజయాన్ని మమతా బెనర్జీ ముందే ఊహించారు: ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు