కంగన వెనుక ఎవరున్నారు?

11 Sep, 2020 10:29 IST|Sakshi

(వెబ్‌ స్పెషల్‌): ఇప్పుడు అందరి నోటా విన్పిస్తున్న  ప్రశ్న ఇదే. శివసేనను సవాల్‌ చేసి మరాఠా గడ్డపై అడుగుపెట్టిన ‘క్వీన్‌’వెనుక ఎవరున్నారనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాషాయ దళం అండ దండలు ‘ఫైర్‌ బ్రాండ్‌’కు మెండుగా ఉన్నాయని ప్రత్యర్థులు పేర్కొంటున్నారు. బాలీవుడ్‌ మొండి ఘటంగా ముద్రబడిన కంగన రనౌత్‌..‘మహా’సర్కారును అంతే మొండిగా ఎదుర్కొంటున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా సినిమా తారలు ప్రభుత్వాలను, అధికార పార్టాలను ఎదురించే సాహసం చేయరు. కంగన మాత్రం శివసేన నాయకులకు సవాల్‌ విసిరి మరీ ముంబైలో అడుగుపెట్టారు. అక్కడితో ఆగకుండా శివసేన సర్కారును ఇంకా సవాల్‌ చేస్తూనే ఉన్నారు. ఇంత ధైర్యం ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది? వెనకుండి ఆమెను నడిపిస్తున్నది ఎవరు?

బంధుప్రీతి.. డ్రగ్స్‌.. సినీ మాఫియా
బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌, శివసేన సర్కారు మధ్య కోల్డ్‌వార్‌ ఇప్పట్లో ముగిసేట్టు కనిపించడం లేదు. యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంతో మొదలైన వివాదం ఇప్పుడు ‘క్వీన్‌ వర్సెస్‌ సేన’గా మారిపోయింది. బాలీవుడ్‌లో బంధుప్రీతికి వ్యతికంగా గళం విప్పి వివాదానికి శ్రీకారం చుట్టిన కంగన ఇప్పటికీ తనదైన శైలిలో కొనసాగిస్తున్నారు. బాలీవుడ్‌ మాఫియా నెపోటిజం కారణంగానే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆమె పేర్కొనడంలో దుమారం రేగింది. నటీనటులు, దర్శకనిర్మాతలు, సాంకేతిక నిపుణుల మాటల యుద్ధంతో వివాదం రాజుకుంటూ వచ్చింది. సుశాంత్‌ కేసులో డ్రగ్‌ మాఫియా లింకులు రట్టు కావడం, రాజకీయ నాయకుల జోక్యంతో వివాదం కొత్త మలుపు తిరిగింది.

రనౌత్‌ వర్సెస్‌ రౌత్‌
మూవీ మాఫియా కన్నా ముంబై పోలీసులంటే తనకు భయమని కంగన ట్వీట్‌ చేయడంతో రంగంలోకి శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ వచ్చారు. అంత భయం ఉంటే ముంబైకి రావొద్దని కంగనకు కౌంటర్‌కు ఇచ్చారు. ‘క్వీన్‌’ ఏమాత్రం తగ్గకుండా ముంబై ఏమైనా పీఓకేనా? అంటూ ప్రశ్నించారు. తమ రాష్ట్ర రాజధానిని పీఓకేతో పోల్చిన కంగపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ముంబై అధికార యంత్రాంగం కంగన కార్యాలయంలోని అక్రమ నిర్మాణాలను హడావుడిగా కూల్చేసింది. విశేషం ఏమిటంటే 2016-19 మధ్య కాలంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా బీఎంసీ అధికారులు కేవలం 10.47 శాతం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. మరోవైపు శివసేన ప్రభుత్వాన్ని సవాల్‌ చేసి మరీ ముంబైలో అడుగు పెట్టారు కంగనా రనౌత్‌. కేంద్ర భద్రతా దళాల పహారా నడుమ ‘క్వీన్‌’ ముంబై  చేరుకున్నారు. (భద్రత లేకుంటే నా బిడ్డకు ఏం జరిగేదో!)


ముంబైపై కేంద్రం కుట్ర
కంగన రనౌత్‌కు కేంద్రం వై-ప్లస్‌ భద్రత కల్పించడాన్ని శివసేన తీవ్రంగా విమర్శించింది. మహారాష్ట్ర నుంచి ముంబైని విడదీసే కుట్రలో భాగంగా ఇదంతా చేస్తున్నారని ‘సామ్నా’ సంపాదకీయంలో ఆరోపించింది. ముంబై ప్రతిష్టను దెబ్బతీసి ఆర్థికంగా బలహీనపర్చాలనే కుట్రలు ఢిల్లీలో జరుగుతున్నాయని.. ఇలాంటి వాటి పట్ల మహారాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివసేన రాసుకొచ్చింది. ముంబైని, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించిన కంగనకు బీజేపీ బహిరంగంగా మద్దతు పలకడంపై అసహనం వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వాన్ని దాడి చేసేందుకు చిన్న అవకాశాన్ని కూడా బీజేపీ, కేంద్రం విడిచిపెట్టడం లేదని మండిపడింది. కంగన రనౌత్‌కు తమదైన పద్ధతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించింది. కంగనకు ప్రధాని నరేంద్ర మోదీ అండదండలు ఉన్నాయని పరోక్షంగా పేర్కొంది. అయితే కంగన విషయంలో శివసేన అత్యుత్సాహం ప్రదర్శించడం పట్ల ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ మరాఠా సెంటిమెంట్‌తో రాజకీయాలు చేసిన శివసేన ఇప్పుడు అధికార పార్టీగా చాలా అప్రమత్తతో వ్యవహరించాల్సి ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. (ఎన్ని నోళ్లు మూయించగలరు?)

‘క్వీన్‌’కు కమలనాథుల బాసట
శివసేన ఆరోపణల్లో వాస్తవం ఉందని బీజేపీ చర్యలు నిరూపిస్తున్నాయి. కంగన కార్యాలయంలో అక్రమ నిర్మాణాలను బీఎంసీ సిబ్బంది కూల్చివేయాన్ని మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కొశ్యారీ ఖండించారు. అంతేకాదు కేంద్రానికి నివేదిక పంపాలని బీఎంసీ అధికారులకు ఆదేశాలిచ్చారు. బీజేపీ పాలిత హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ కూడా కంగన కార్యాలయం కూల్చివేతను ఖండించారు. కంగనకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సైతం బాసటగా నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కంగనా రౌనత్‌కు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు ఏకంగా యజ్ఞం నిర్వహించారు. బీజేపీ మిత్రపక్షమైన అథావలె పార్టీ ఆర్‌పీఐ(ఏ) కూడా కంగనకు మద్దతు ప్రకటించింది. కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథావలె స్వయంగా కంగన నివాసానికి వెళ్లి సంఘీభావం తెలిపారు.

క్వీన్‌ పాలి‘ట్రిక్స్‌’
శివసేనను సవాల్‌ చేసిన కంగనా రనౌత్‌ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. తనకు అండగా నిలిచిన బీజేపీలో ఆమె చేరతారన్న వార్తలు గత కొద్ది రోజులు షికారు చేస్తున్నాయి. తాజాగా కంగన చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. శివసేన.. సోనియా సేనగా మారిందని.. బాల్‌ థాకరే సిద్ధాంతాలను అధికారం తాకట్టు పెట్టిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ పరిణామాలు చూస్తుంటే కంగన రాజకీయాల్లోకి రావడం ఖాయమన్న భావన కలుగుతోంది. పొలిటికల్‌ ఎంట్రీపై ఆమె ఇప్పటివరకు విస్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే, మరాఠి ప్రజలు తనకు నైతిక మద్దతు ఇస్తున్నారని.. శివసేన ప్రభుత్వ చర్యలను సమర్థించడం లేదని తాజాగా చేసిన ట్వీట్‌లో కంగన పేర్కొన్నారు. ఉద్ధవ్‌ సర్కారు పొకడలు మరాఠీల ప్రతిష్టను ఏమాత్రం దెబ్బతీయలేవని స్పష్టం చేశారు. కాగా, కంగన నివాసం వెలుపల ముంబై పోలీసులు కాపలా కాయడం కొసమెరుపు.

బిహార్‌ ఎన్నికల కోసమేనా?
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే సుశాంత్‌, కంగన వ్యవహారాన్ని బీజేపీ వాడుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కరోనా విలయం, ఆర్థిక సంక్షోభాన్ని నివారించడంలో మోదీ సర్కారు విఫలమైందని విరుచుకుపడుతున్నాయి. చైనాతో సరిహద్దు వివాదాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని బీజేపీ చూస్తోందని అంటున్నాయి. త్వరలో జరగనున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు కమలం పార్టీ ఈ నాటకాలు ఆడుతోందని ఆరోపిస్తున్నాయి. (4 రోజుల్లో కంగన వెళ్లిపోతున్నారు: బీఎంసీ)

Poll
Loading...
Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు