కారుకు అండగా ఉండేదెవరు? ప్రత్యర్థిగా మారెదెవరు?

6 Oct, 2022 14:59 IST|Sakshi

కెసిఆర్‌కు వెనకనుంచి మద్ధతిస్తున్నదెవరు?

తమిళనాడు, కర్ణాటక నేతల అంతరంగమేంటీ?

మహారాష్ట్రలో ఠాక్రేల మద్ధతు ఉంటుందా?

ఉత్తరాదిన కలిసివచ్చేదెవరు?

దక్షిణ భారత దేశంలోనూ పలు ప్రాంతీయ పార్టీలతో కేసీఆర్ మంతనాలు జరిపారు. మాజీ ప్రధాని జేడీఎస్ నాయకులు దేవెగౌడతోపాటు ఆయన కుమారుడు కుమారస్వామితో కేసీఆర్ పలుమార్లు భేటీ అయ్యారు. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బలంగా ఉన్న జేడీఎస్ ఇప్పుడు కేసీఆర్‌తో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే  చాలాకాలంగా అటు బీజేపీతో కాని ఇటు కాంగ్రెస్‌తో పాటు కర్ణాటకలో పొత్తులు పెట్టుకున్న దేవెగౌడ పార్టీ మళ్లీ ఈ పార్టీల వైపే మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. అయితే టీఆర్ఎస్ నాయకులు మాత్రం జేడీఎస్ బలంగా లేని బెంగుళూర్ లాంటి ప్రాంతాల్లో ఆ పార్టీ నేతలు కేసీఆర్ గుర్తుపై పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు. 

ఇక ఇటీవలే అధికారంతో పాటు పార్టీని పొగొట్టుకున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తమతో కలిసే అవకాశాలున్నాయని గులాబీ నేతలు చెబుతున్నారు. నిజామాబాద్, అదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని పలు నియోజకవర్గాలతోపాటు మహారాష్ట్రలో ఉద్ధవ్‌తో కలిసి పోటీ చేస్తామని బీఆర్‌ఎస్ పార్టీ నేతలంటున్నారు. 

ఇక తమిళనాట స్టాలిన్‌తోనూ కేసీఆర్ చర్చలు జరిపారు. అయితే కాంగ్రెస్ పార్టీతో చాలాకాలంగా మితృత్వం నెరుపుతున్న స్టాలిన్ గులాబీ పార్టీతో దోస్తీకి అంతగా ఆసక్తి చూపే అవకాశాలు లేవు. అయితే తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం  బీఆర్‌ఎస్‌కు మద్దతు లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ విభజనే లక్ష్యంగా పుట్టిన గులాబీ పార్టీపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సహజమైన వ్యతిరేక భావన ఉంది.  విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌ పార్టీని అంగీకరించడం అంత సులువైన పనికాదు.  

ఇప్పటికే నిలదొక్కుకున్న రాజకీయ పార్టీలు తమ రాష్ట్రాల్లోకి బీఆర్‌ఎస్‌ను స్వాగతించే అవకాశాలు చాలా తక్కువ. అందుకే చిన్న చిన్న పార్టీలను విలీనం చేసుకోవడం ద్వారా పార్టీని విస్తరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఒకరిద్దరు ఎంపీలున్న పార్టీలకు ఆర్ధిక అండదండాలు అందించి వాటిని  విలీనం చేసుకోవడం మంచి స్ట్రాటజీగా గులాబీ నాయకులు భావిస్తున్నారు. అందుకే తమిళనాడుకు చెందిన విదుతాలై చిరుతైగల్‌ కట్చె అధ్యక్షుడు తిరుమావళవన్  పార్టీ నామకరణం కార్యక్రమానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

ఇలాంటి పార్టీలతో చర్చలు జరిపి వివిధ రాష్ట్రాల్లో పార్టీని ఎస్టాబ్లిష్ చేసేందుకు కేసీఆర్ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. దీంతోపాటు స్వతంత్ర్యంగా గెలవగలిగే సత్తా ఉన్న నాయకుల కోసం బీఆర్‌ఎస్ దేశవ్యాప్తంగా వేట ప్రారంభించింది. రాబోయే రోజుల్లో ఇలాంటి నేతలు బీఆర్‌ఎస్ జెండాను అన్ని రాష్ట్రాల్లో ఎగరవేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేయడం జాతీయ పార్టీ గుర్తంపు తెచ్చుకోవడమే ఇప్పుడు బీఆర్‌ఎస్ ముందున్న అతిపెద్ద వ్యూహంగా చెబుతున్నారు.

ఇక జాతీయ రాజకీయాల్లో గెలవాలనుకుంటున్న బీఆర్ఎస్ ముందుగా 2023లో జరిగే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కుంటుందనేదే అతి పెద్ద చాలెంజ్. 2023లో తెలంగాణాలో భారీ మెజార్టీ సాధిస్తేనే బీఆర్ఎస్ విస్తరణ సాధ్యమయ్యే అవకాశాలున్నాయి. లేదంటే అసలుకే మోసం జరిగే ప్రమాదం ఉంది.

ఇది కూడా చదవండి: KCR TRS To BRS: పార్టీ పేరు మారిపోయింది.. కేసీఆర్‌ నెక్ట్స్ స్టెప్‌ ఏంటి ?

మరిన్ని వార్తలు