వైఎస్సార్‌ ఉంటే కరకట్ట పూర్తయ్యేది: షర్మిల 

24 Jul, 2022 02:13 IST|Sakshi
భద్రాచలం సబ్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో షర్మిల, నాయకులు  

భద్రాచలం: వైఎస్సార్‌ జీవించి ఉంటే భద్రాచలం మొత్తం కరకట్ట నిర్మాణం పూర్తయి ఉండేదని, అలా జరగకపోవడంతో ప్రజలు ముంపు బారిన పడ్డారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. గోదావరి వరదతో ముంపునకు గురైన ప్రజలను పరామర్శించాల్సింది పోయి భద్రాచలం వచ్చిన సీఎం కేసీఆర్‌ కరకట్టపై నిలబడి కట్టుకథలు, పిట్టకథలు చెప్పి వెళ్లిపోయారని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, పినపాక మండలాల్లో ముంపు బాధితులను శనివారం ఆమె పరామర్శించారు.

పలువురి ఇళ్లకు వెళ్లి నష్టం వివరాలు తెలుసుకున్నారు. అనంతరం షర్మిల భద్రాచలంలోని సబ్‌ కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. జిల్లాకు చెందిన మంత్రి పోలవరంతోనే ముంపు వచ్చిందని చెబుతున్నారని, ఇదే నిజమైతే ఇన్ని రోజులు ఏమైపోయారని ప్రశ్నించారు. కాగా, ముంపు బాధితులకు రూ.10 వేలు కాకుండా కుటుంబానికి రూ.25 వేలు ఇవ్వడంతోపాటు గోదావరి తీరంలో కరకట్ట నిర్మాణాన్ని పూర్తిచేయాలని షర్మిల డిమాండ్‌ చేశారు. 

నేడు లాల్‌దర్వాజ బోనాలకు షర్మిల 
హైదరాబాద్‌ పాతబస్తీలో జరిగే బోనాల వేడుకల్లో షర్మిల పాల్గొననున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు లాల్‌దర్వాజలోని సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రోగ్రామ్, గ్రేటర్‌ హైదరాబాద్‌ కోఆర్డినేటర్‌ వాడుక రాజగోపాల్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు