మార్షల్స్‌ లేకపోతే.. గవర్నర్‌ను టీడీపీ సభ్యులు ఏం చేసేవారో?

11 Mar, 2022 03:27 IST|Sakshi
అసెంబ్లీలో మాట్లాడుతున్న చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అంబటి, జోగి రమేష్‌

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి  

వికేంద్రీకరణపై సభలో చర్చ జరగాలి: అంబటి 

టీడీపీ చార్జిషీట్‌పై జోగి రమేష్‌ మండిపాటు 

సాక్షి, అమరావతి: శాసనసభలో గవర్నర్‌ ప్రసంగం సమయంలో టీడీపీ సభ్యులు ఆయనపై దాడిచేసేందుకు కూడా వెనుకాడని రీతిలో ప్రవర్తించారని.. పోడియం వద్ద మార్షల్స్‌ లేకపోతే ఏం చేసేవారోనని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష సభ్యులు దారుణంగా వ్యవహరించారని, వారి తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం అసెంబ్లీలో ఆయనతోపాటు ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ మాట్లాడారు. శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలని, సంక్షేమ పథకాలు నేరుగా పేదల ఇంటికే చేరాలని సీఎం వైఎస్‌ జగన్‌ దేశంలోనే రోల్‌మోడల్‌గా పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు.

కరోనా సమయంలో ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అమలుచేయకపోయి ఉండుంటే రాష్ట్రంలో పరిస్థితి ఘోరంగా ఉండేదని, వలసలు విపరీతంగా పెరిగేవని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆ సమయంలో ఏపీ ప్రజలు సంతోషంగా జీవించారని చెప్పారు. టీడీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైందని వివరించారు. పేద వారికి కావాల్సింది విద్య, వైద్యమని.. ఈ రెండు రంగాల్లో సీఎం జగన్‌ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారని చెప్పారు. వ్యాక్సినేషన్‌లో ఏపీ అందరికీ ఆదర్శంగా నిలిచిందని.. మహిళా సాధికారత ఏ మేరకు సాకారమైందో అందరికీ స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. దేశంలోనే నంబర్‌ వన్‌ ముఖ్యమంత్రి అని వైఎస్‌ జగన్‌కు స్కోచ్‌ సంస్థ అవార్డు ప్రకటించిందన్నారు.
 
ప్రతిపక్షానికి దశ, దిశ లేవు 
అంబటి మాట్లాడుతూ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన టీడీపీకి ఒక దశ, దిశ లేవని, కేడర్‌ను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతోందని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం 30.70 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలిచ్చిందన్నారు. ఇక, రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణపై సభలో చర్చ జరగాలని ఆయన స్పీకర్‌ను కోరారు.  

సంక్షేమ ఫలాలు అందించడమే విధ్వంసమా? 
జోగి రమేష్‌ మాట్లాడుతూ.. ఎక్కడా అమలుచేయనన్ని సంక్షేమ ఫలాలను అందించడమే విధ్వంసమా?.. సామాజిక న్యాయం పాటించడమే విధ్వంసమా?.. అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ వెయ్యి రోజుల పాలనపై టీడీపీ చార్జిషీట్‌ విడుదల చేయడంపై మండిపడ్డారు. పుట్టబోయే బిడ్డ నుంచి పండు ముదుసలి వరకూ ప్రతీఒక్కరి అవసరాలను తీరుస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ను ప్రజలు తమ గుండెల్లో పెట్టు కుని పూజిస్తున్నారన్నారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి రాళ్లు, చెప్పులతో చంద్ర బాబు కొట్టిస్తే మా నాయకుడు ఆ మహనీయుడి పేరు ఓ జిల్లాకు పెడుతున్నారన్నారు. 

మరిన్ని వార్తలు