ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి 

28 Sep, 2020 04:13 IST|Sakshi

యువతెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి

హయత్‌నగర్‌: తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తూ వారి ఆకాంక్షలను నెరవేర్చాలని యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా పెద్దంబర్‌పేట్‌ మున్సిపాలిటీ పరిధిలోని జె కన్వెన్షన్‌ హాలులో జరిగిన పార్టీ 2వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అమరవీరులకు తగిన గుర్తింపు ఇవ్వాలని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ కవులు, కళాకారుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించాలని కోరారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన కంపెనీల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, రాష్ట్రంలో మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసి మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టాలని కోరారు. ఈమేరకు సమావేశంలో 15 తీర్మానాలు చేసి ఆమోదించారు.  

ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాణి రుద్రమరెడ్డి 
నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో జరిగే ఎన్నికల్లో యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణి రుద్రమరెడ్డి బరిలో దిగనున్నారు. ఈమేరకు సమావేశంలో తీర్మానం చేసి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.కాజన్‌గౌడ్, సోమగు శంకర్, ఎన్‌.రవికుమార్, తుమ్మ రమేష్, జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ(భువనగిరి) జె.వెంకటనారాయణ (ఖమ్మం) తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు