మెగా జాబ్‌మేళా పోస్టర్‌ ఆవిష్కరణ

30 May, 2023 00:44 IST|Sakshi

ఒంగోలు అర్బన్‌: మద్దిపాడు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో జూన్‌ 4న నిర్వహించనున్న మెగా జాబ్‌మేళా పోస్టర్‌ను కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ స్పందన భవనంలో ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్‌, సీడాక్‌ సంయుక్త ఆధ్వర్యంలో 20 కంపెనీలతో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 10వ తరగతి నుంచి బీటెక్‌, పీజీలు పూర్తి చేసిన యువత జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు, డీఆర్‌ఓ శ్రీలత, ఎంప్లాయిమెంట్‌ అధికారి భరద్వాజ్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి లోక్‌నాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

5కు చేరిన మృతుల సంఖ్య

యర్రగొండపాలెం: త్రిపురాంతకంలో ఆదివారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 5కు చేరింది. అనంతపురం నుంచి విజయవాడకు వెళ్తున్న కారు, విజయవాడ నుంచి హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో నలుగురు మృతి చెందిన విషయం విధితమే. మరో ఇద్దరు కొయన రాజు(27), ఆరి భవాని శంకర్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని వినుకొండలోని ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. రాజును మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఒక వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయిస్తున్న సమయంలో సోమవారం మృతి చెందినట్లు ఎస్సై పీవీ సైదులు తెలిపారు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్టీసీ విజ్ఞప్తి

ఒంగోలు: ఒంగోలు, టంగుటూరు బస్టాండ్లలోని ఖాళీ ప్రదేశాన్ని 15 ఏళ్లపాటు లీజుకిచ్చేందుకు ఆర్టీసీ నిర్ణయించిందని, ఆసక్తి ఉన్నవారు టెండర్లు దాఖలు చేయాలని ఆర్టీసీ ఆర్‌ఎం బి.సుధాకర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బిడ్లను జూన్‌ 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఆర్టీసీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని దాఖలు చేయాల్సి ఉంటుందని, 8వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు నెల్లూరు ఈడీ కార్యాలయంలోని టెండరు బాక్సులో వేయాలని స్పష్టం చేశారు. టెండర్లు మధ్యాహ్నం 3 గంటలకు తెరుస్తామని తెలిపారు. ఒంగోలు గ్యారేజీ (ఆర్టీసీ ఆసుపత్రి ఎదురుగా) 1978 చదరపు గజాలు, టంగుటూరు బస్టాండులోని 1445 చదరపు గజాలకు టెండర్లు కోరుతున్నామన్నారు. లీజుకు తీసుకోవాలనుకునేవారికి మంగళవారం ఉదయం 11 గంటలకు స్థానిక ఆర్టీసీ బస్టాండులోని ఆర్‌ఎం కార్యాలయంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నామని, ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు