మినీ ఇండియా.. | Sakshi
Sakshi News home page

మినీ ఇండియా..

Published Tue, May 30 2023 12:44 AM

జవహర్‌ నవోదయ ప్రధాన ద్వారం - Sakshi

జవహర్‌ నవోదయ..

మార్కాపురం: నవోదయలో సీటు అంటే క్రేజ్‌. సుమారు 10 నెలల పాటు తల్లిదండ్రులు తమ పిల్లలను కోచింగ్‌ సెంటర్లలో చేర్పించి శిక్షణ ఇస్తుంటారు. ఫలితాలు వచ్చే వరకు టెన్షన్‌ పడుతుంటారు. సీటు వస్తే 6 నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ మోడల్‌లో ఉచిత విద్య.. విభిన్న అంశాల్లో ప్రత్యేక శిక్షణ, తమ పిల్లల భవిష్యత్తుపై భరోసా.. ఈ నేపథ్యంలో నవోదయలో చదివించాలని తల్లిదండ్రులు తాపత్రయపడుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం జవహర్‌ నవోదయ విద్యాలయాలు నిర్వహిస్తోంది. రెసిడెన్షియల్‌ స్కూళ్లలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యాలయాలను ప్రారంభించి 6 నుంచి 12వ తరగతి వరకు ఉచిత బోధన, వసతి సౌకర్యాలను కూడా కల్పించాలని నిర్ణయించింది.

జిల్లాలో ఒంగోలుతో పాటు మార్కాపురంలో నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. 2009లో మార్కాపురం సమీపంలోని గజ్జలకొండలో ప్రారంభమైన జవహర్‌ నవోదయ విద్యాలయం–2ను ప్రస్తుతం ఒంగోలు రోడ్డులో జాతీయ రహదారి పక్కన కలుజువ్వలపాడు సమీపంలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఆధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 696 నవోదయ విద్యాలయాలు ఉండగా, మార్కాపురం విద్యాలయం 596వది. ప్రతి నవోదయ కేంద్రంలో 6 నుంచి 12వ తరగతి వరకు 480 సీట్లు ఉంటాయి. 6 నుంచి 10వ తరగతి వరకు క్లాస్‌కు 80 సీట్లు చొప్పున 400ల సీట్లు, 11వ తరగతిలో 40, 12వ తరగతిలో 40 సీట్లు ఉంటాయి. ఇలా ఒంగోలు నవోదయాలో 480, మార్కాపురం నవోదయాలో 480 సీట్లు ఉన్నాయి. 6, 9, 11 తరగతిల్లో ప్రవేశాలకు ప్రతి ఏటా పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం 11వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మార్కాపురం నవోదయలో 447 మంది, ఒంగోలు నవోదయలో 444 మంది విద్యార్థులు చదువుతున్నారు.

మెరుగైన విద్యా విధానం..

జవహర్‌ నవోదయను మినీ ఇండియాగా పిలుస్తుంటారు. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇక్కడ ఉంటారు. సర్వభాష మత సమ్మేళనంగా, జాతీయ సమైక్యతకు ప్రతీకగా భావిస్తోంటారు. ఇక్కడ పని చేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు బహుభాషా కోవిదులు. కేరళ, బిహార్‌, చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర ప్రాంతాల వారు మార్కాపురం నవోదయలో పని చేస్తున్నారు. విద్యార్థులు కూడా చత్తీస్‌ఘడ్‌, కేరళ, బిహార్‌ నుంచి వచ్చి ఇక్కడ చదువుతుంటారు. శాసీ్త్రయమైన విద్యాబోధన ఉంటుంది. క్లాసులు అయిపోగానే వారిలోని సృజనాత్మకతను బయటకు తీసే అంశాల్లో ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తారు. డ్రాయింగ్‌, మ్యూజిక్‌, క్రీడల్లో బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, కబడ్డీ, తదితర అంశాల్లో తర్ఫీదు ఇస్తారు. ఏటా జాతీయస్థాయి క్రీడలు నిర్వహిస్తారు. ఉదయం 5 గంటలకే విద్యార్థులు నిద్రలేస్తారు. మానసికంగా దృఢంగా ఉండేందుకు యోగా, వ్యాయామం అనంతరం పోషకాలు ఉండే అల్పహారం అందిస్తారు. మధ్యాహ్నం, రాత్రి నాణ్యమైన భోజనం పెడతారు. ర్యాంక్‌ల ప్రతిపాదికన కాకుండా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తూ అన్ని అంశాల్లో శిక్షణ ఇస్తూ జీవితంలో ఎలాంటి కష్టానైన్నా ఎదుర్కొనే మానసిక ధైర్యాన్ని ఇచ్చే శిక్షణ ఇక్కడ ప్రత్యేకత. మన రాష్ట్రంలో మొత్తం 15 జవహర్‌ నవోదయ విద్యాలయాలు ఉండగా ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2 చొప్పున ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన 10, 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో నవోదయ విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. 10లో 77 మంది, 12లో 40 మంది పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. 10లో సుప్రియకు 500/469, 12లో సాయిసుధా మాదురి 500/480 మార్కులు సాధించింది. చుట్టూ చెట్లు, మధ్యలో క్రీడా మైదానాలు, విద్యార్థుల వసతి గృహాలు, సిబ్బంది క్వార్టర్స్‌ ఇలా చూడటానికి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

ప్రవేశాలు ఇలా..

6, 9వ తరగతిలో ప్రవేశానికి జవహర్‌ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరంలో 11వ తరగతిలో ఖాళీ సీట్లలో పోటీ పరీక్ష ద్వారా ప్రవేశం కోసం ఆన్‌లైన్‌లో ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జూలై 22న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మార్కాపురం జవహర్‌ నవోదయలో 19, ఒంగోలులో 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

హై క్వాలిటీ ఎడ్యుకేషన్‌

మార్కాపురం–ఒంగోలు హైవే రోడ్డులో ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయంలో మంచి నాణ్యమైన విద్యను అందిస్తాం. మంచి భోజనంతో పాటు వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, క్రీడలు, నేర్పిస్తాం. చదువు నిమిత్తం ఇతర రాష్ట్రాలు కూడా పంపుతుంటాం. 11వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 31లోగా దరఖాస్తు సమర్పించాలి.

– బీఈజీ ప్రసన్నకుమార్‌, ప్రిన్సిపల్‌, జవహర్‌ నవోదయ విద్యాలయం–2

1/1

Advertisement
Advertisement