బస్సు యాత్రను జయప్రదం చేయాలి

16 Nov, 2023 00:34 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మాజీమంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి

పార్టీ నాయకులు, కార్యకర్తలకు బాలినేని పిలుపు

ఒంగోలు: ఈనెల 21న ఒంగోలులో నిర్వహించనున్న సామాజిక సాధికార బస్సు యాత్రను జయప్రదం చేయాలని మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక తన నివాసంలో ఒంగోలు నగర పార్టీ నాయకులు, కార్యకర్తలతో బుధవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వంలో వారికి జరిగిన న్యాయాన్ని వివరించేందుకు సామాజిక సాధికార బస్సు యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తోందన్నారు. అందులో భాగంగా జరిగే యాత్ర ఈనెల 21న ఒంగోలుకు వస్తుందని, జిల్లాలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు పాల్గొని విజయంతం చేయాలన్నారు. ప్రతి డివిజన్‌ అధ్యక్షులు, కార్పొరేటర్‌ సంయుక్తంగా వారి పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులను కలుపుకుని లబ్ధిదారులతోపాటు ప్రజలను చైతన్యం చేసి పార్టీ కార్యక్రమంలో పాల్గొనేలా చేయాలన్నారు. నిజాయతీగా వ్యవహరిస్తున్నా నిందలు వేయడమే పనిగా ప్రతిపక్ష పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని, తాను మాత్రం నిజాయతీనే నమ్ముకుని ముందుకు సాగుతానన్నారు. గత 15 సంవత్సరాలుగా నకిలీ దస్తావేజుల ప్రక్రియ కొనసాగుతోందని, వెలుగులోకి రాగానే ప్రత్యేకంగా స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమును సైతం వేయించిన ఏకై క ఎమ్మెల్యేను తాను మాత్రమే అన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా నిజాయతీతోనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సామాజిక సాధికార బస్సు యాత్రకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలపై నాయకులు, కార్యకర్తలతో సమీక్షించారు. కార్యక్రమంలో నగర మేయర్‌ గంగాడ సుజాత, ఒడా చైర్‌పర్సన్‌ సింగరాజు మీనాకుమారి, నగర కన్వీనర్‌ కటారి శంకర్‌, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్‌, లిడ్‌ క్యాప్‌ చైర్మన్‌ కాకుమాను రాజశేఖర్‌, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ జలీల్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, 3వ క్లస్టర్‌ ఇన్‌చార్జి గంటా రాము, ఒంగోలు ఏఎంసీ మాజీ చైర్మన్‌ అయినాబత్తిన ఘనశ్యాం, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి చింతగుంట్ల సువర్ణ, డివిజన్‌ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు