27 నుంచి కుల గణన సర్వే | Sakshi
Sakshi News home page

27 నుంచి కుల గణన సర్వే

Published Thu, Nov 16 2023 12:34 AM

కుల గణన సర్వేపై సమావేశం నిర్వహిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌  - Sakshi

ఒంగోలు అర్బన్‌: జిల్లాలో వివిధ సామాజికవర్గాలకు సంబంధించిన వివరాలను కచ్చితమైన గణాంకాలతో సేకరించేందుకు ఈ నెల 27వ తేదీ నుంచి కుల గణన సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. సర్వేపై బుధవారం ప్రకాశం భవనంలో అధికారులు, కుల సంఘాలు, మత పెద్దలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి కుల గణన సర్వే ఉద్దేశాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సర్వే ప్రక్రియలో యంత్రాంగానికి కుల సంఘాలు, మత పెద్దల సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఆయా వర్గాల వారికి మరింత మెరుగ్గా అందేలా విధాన పరమైన నిర్ణయం తీసుకునేందుకు ఈ సర్వే ఉపకరిస్తుందన్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటారని తెలిపారు. ఈ సర్వేపై కుల సంఘాలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కుల సంఘాలు, మత పెద్దలకు ఈ సర్వేపై ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేయడంతో పాటు సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కుల గణనను ఆధారంగా చేసుకుని కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయబోమన్నారు. ఇప్పటి వరకు వర్తిస్తున్న సంక్షేమ పథకాలు ఏవీ తొలగింపబడవన్నారు. సర్వే వివరాలు లీక్‌ కావని, మొబైల్‌ యాప్‌లో నమోదు చేయగానే అవి మొత్తం అప్పటికప్పుడే ప్రభుత్వ డేటా బేస్‌లో భద్రపరుస్తారన్నారు.

వివిధ కుల సంఘాలు, మత పెద్దలు మాట్లాడుతూ స్వతంత్ర భారతంలో తొలిసారి కుల గణన సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయమన్నారు. కులాల వివరాలతో పాటు ప్రజల ఆస్తులు, ఇతర సమాచారాన్ని కూడా నమోదు చేయాలన్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లిన గిరిజన జాతుల వివరాలను కూడా ఈ సర్వేలో నమోదు చేసేలా చూడాలని ఆదేశించారు. ముస్లింల్లోని దూదేకులను కొన్ని చోట్ల ఓసీ కులస్తులుగా నమోదు చేస్తున్నారని, కులాలతో పాటు వృత్తి వివరాలు కూడా సేకరించాలని కోరారు. బలహీన వర్గాల కులాల పేరుతో నకిలీ ధ్రువీకరణ పత్రాలు పొంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని సచివాలయాలను యాదృశ్చికంగా ఎంపిక చేసి సర్వే జరుగుతున్న తీరును కూడా వ్యక్తిగతంగా పరిశీలిస్తానని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్‌, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు, బీసీ సంక్షేమ అధికారి అంజల, మైనార్టీ సంక్షేమ అధికారి సురేష్‌కన్నా, బీసీ కార్పొరేషన్‌ ఈడీ వెంకటేశ్వరరావు, ఎస్‌సీ కార్పొరేషన్‌ ఈడీ అర్జున్‌ నాయక్‌, సచివాలయాల నోడల్‌ అధికారి ఉషారాణి, కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు.

కుల సంఘాలు, మత పెద్దలు సహకరించాలి రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌

Advertisement
Advertisement