కమీషన్‌ తీసుకుని.. నాపై అబద్ధాలా.. | Sakshi
Sakshi News home page

కమీషన్‌ తీసుకుని.. నాపై అబద్ధాలా..

Published Thu, Nov 16 2023 12:34 AM

విలేకర్లతో మాట్లాడుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి   - Sakshi

కొత్తపట్నం: బకింగ్‌హామ్‌ బ్రిడ్జి పనుల్లో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు కమీషన్‌ తను తీసుకుని తాను తీసుకున్నానని అబద్ధాలు చెప్పడం ఎంతవరకు న్యాయమని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. కొత్తపట్నంలో రూ.2.75 కోట్లతో డబుల్‌ రోడ్డు శంకుస్థాపన అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బకింగ్‌హామ్‌ బ్రిడ్జి కేంద్రం నుంచి వచ్చిన నిధులతో నిర్మిస్తున్నారన్నారు. 2018 నాటికి పూర్తి చేయాలని అగ్రిమెంట్‌ ఉందని, ఆ లోపు పూర్తి చేయకపోవటంతో కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమ్‌ రద్దు చేసిందని చెప్పారు. వారు చేసిన తప్పు చెప్పకుండా తాను కమీషన్‌ తీసుకున్నానని, పనులు చేయలేదని అబద్ధాలు చెబుతున్నారన్నారు. అప్పటికి రూ.8 కోట్లతో 40 శాతం పనులు మాత్రమే చేశారని.. తాను వచ్చిన తరువాత రూ.9 కోట్లతో 40 శాతం పనులు జరిగాయన్నారు. ఇప్పుడు జనార్దన్‌ 80 శాతం చేశానని, 20 శాతం కూడా చేయలేదని అబద్ధాలు చెప్పడం ఎంత అన్యాయమన్నారు. కావాలని ఆ కాంట్రాక్టర్‌ పనులు ఆపేస్తే సొంత డబ్బులు రూ.40 లక్షలు పెట్టి మెటీరియల్‌ తోలించి మెటల్‌ వేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తే నా మీద అసత్య ఆరోపణలు చేయటం ఎంత వరకు సబబని మండిపడ్డారు. నిజం ఏమిటో ఏ గుళ్లోనైనా ప్రమాణం చేద్దామని సవాల్‌ విసిరారు. ఈ నెల 21న సామాజిక సాధికార బస్సు యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మండల నాయకులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ నెలలోనే ఒంగోలులోనే 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతానని హామీ ఇచ్చారు. కొత్తపట్నం, ఒంగోలు మండలంలో కూడా కొన్ని గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి కూడా రూ.7 కోట్లు కావాలని చెప్పానని, అవి కూడా అయిపోతాయన్నారు. రెండు నెలల్లో రోడ్లు, ఇళ్ల పట్టాలన్నీ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఒంగోలులో రెండు చోట్ల స్థలాలు తీసుకున్నామని, పెద్ద సిటీగా చేస్తామని వివరించారు.

జనార్దన్‌ కంటే ఎక్కువే చేశాం:

మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు కంటే ఎక్కువే అభివృద్ధి పనులు చేశామని బాలినేని శ్రీనివాసరెడ్డి వివరించారు. మండలంలో 15 పంచాయతీలకు రూ.20 కోట్లతో ఎప్పటి నుంచో తుప్పుపట్టిన విద్యుత్‌ స్తంభాలు, వైర్లు మార్చి ఆధునికీకరణ చేశామన్నారు. రూ.20 కోట్లతో 132/33 సబ్‌ స్టేషన్‌ పూర్తి చేసే దశలో ఉందని చెప్పారు. జలజీవన్‌ మిషన్‌ ద్వారా రూ.8.90 కోట్లతో ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేశామన్నారు. రూ.400 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌కు త్వరలో సీఎం చేతుల మీద శంకుస్థాపన జరుగుతుందని వివరించారు. ఉలిచి చెక్‌డ్యామ్‌ నిర్మించామని, ఒంగోలు రిమ్స్‌ హాస్పిటల్‌ ఆధునికీకరణ చేసినట్లు తెలిపారు. ఒంగోలు హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు మార్చినట్లు వివరించారు.

భూ ఆక్రమణ చేసే వారిని అరెస్టు చేయాలి:

భూ ఆక్రమణ చేసే ప్రతి ఒక్కరినీ అరెస్టు చేయాలని తాను చెప్పానని తెలిపారు. ఎవరైతే ఆరోపణ చేశారో వారు వచ్చి కేసు పెట్టడం లేదంటే.. వారిది కూడా తప్పు ఉన్నట్లేనన్నారు. రూ.50 కోట్ల ఆస్తి ఉంటే ఎందుకు కేసు పెట్టడం లేదో అర్థం కావటం లేదన్నారు. కంప్లెంట్‌ ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరికై తే అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేస్తామన్నారు. తాను ఒంగోలులో ఉన్నంత కాలం భూ ఆక్రమణలు జరగకుండా చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌, గొర్రిపాటి శ్రీను, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జిల్లా అగ్రికల్చర్‌ అడ్వైజరీ బోర్డు చైర్మన్‌ ఆళ్ల రవీంద్రరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

జనార్దన్‌ వ్యాఖ్యలపై బాలినేని ఆగ్రహం బకింగ్‌హాం బ్రిడ్జి పనులపై జనార్దన్‌ చెప్పేవన్నీ అవాస్తవాలు ఏ గుళ్లోకై నా రండి ప్రమాణం చేద్దాం రూ.40 లక్షల మెటీరియల్‌ తోలించి రోడ్డు వేసి రవాణాకు ఇబ్బంది లేకుండా చేశా ఒంగోలు నగరంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న బాలినేని

Advertisement

తప్పక చదవండి

Advertisement