మహా ముదుర్లు.. కోరుకున్న బైక్‌ కొట్టేసి తెచ్చిస్తారు!!

28 Mar, 2024 14:47 IST|Sakshi

కస్టమర్లకు నచ్చిన సీసీ, కలర్‌ పల్సర్‌ బైక్‌ల దొంగతనం

ఆన్‌లైన్‌లో విక్రయాలు, ఇంటికే డెలివరీ

ఐదు రోజులకొకటి చొప్పున 18 ద్విచక్ర వాహనాల అపహరణ

స్థానికంగా అమ్మితే దొరికిపోతామని పక్క రాష్ట్రాల్లో విక్రయం

బైక్‌ దొంగల వ్యాపారం చూసి విస్తుపోతున్న పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: షోరూమ్‌లో మనకు నచ్చిన కలర్‌, సీసీ బైక్‌ను ఎలాగైతే కొనుగోలు చేస్తామో.. అచ్చం అదే తరహాలో కస్టమర్లు కోరుకున్న పల్సర్‌ బైక్‌ను చోరీ చేయడం భరత్‌ కుమార్‌ స్పెషాలిటీ. ఈ అంతర్రాష్ట్ర ఆటో మొబైల్‌ చోరుడితో పాటు కొట్టేసిన బైక్‌లను విక్రయిస్తున్న మరో నిందితుడి ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.18 లక్షలు విలువ చేసే 18 పల్సర్‌ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ (డీఐ) సుధాకర్‌ బుధవారం కేసు వివరాలు వెల్లడించారు..

● కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మల్లె భరత్‌ కుమార్‌ కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. మద్యానికి బానిసైన అతను ఇళ్లల్లో చోరీలు, ఆటో మొబైల్‌ దొంగతనాలకు పాల్పడేవాడు. ఇప్పటివరకు ఇతనిపై ప్రొద్దుటూరు పీఎస్‌లో పోక్సో కేసు, ఖాజీపేట పీఎస్‌లో 9 హెచ్‌బీ నైట్‌ చోరీ కేసులు, బద్వేల్‌ ఠాణాలో 4 మొటార్‌ సైకిల్‌ దొంగతనాల కేసులున్నాయి. ఇటీవల బద్వేల్‌ సబ్‌ జైలు నుంచి విడుదలయ్యాక హైదరాబాద్‌లోని మలక్‌పేటకు మకాం మార్చాడు.

● విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన భరత్‌ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో సంగారెడ్డి జిల్లాకు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ వలిమోని చిన్నయ్య అలియాస్‌ కిట్టుతో పరిచయం అతడికి ఏర్పడింది. అతను సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌లు విక్రయిస్తుంటాడు. దీంతో ఇరువురు కలిసి బైక్‌ చోరీ, విక్రయాలను ప్రారంభించారు. హ్యాండిల్‌ లాక్‌ వేసి ఉన్న బైక్‌ను కూడా సునాయసంగా తీయడంలో భరత్‌ దిట్ట. ఇళ్ల ముందు, కాలనీలు, సందులలో పార్కింగ్‌ చేసిన వాహనాలను చోరీ చేసే భరత్‌ వాటిని కొన్నాళ్లపాటు మలక్‌పేటలోని తన ఇంటికి సమీపంలో దాచిపెట్టేవాడు.

ఐదు రోజులకొక బైక్‌ చోరీ..

ఇప్పటివరకు ఈ ముఠాపై సైబరాబాద్‌లో ఒకటి, హైదరాబాద్‌లో 7, రాచకొండలో 10 కేసులున్నాయి. ఐదు రోజులకొకటి చొప్పున ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 18 పల్సర్‌ బైక్‌లను చోరీ చేశారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్‌ పీఎస్‌ పరిధిలోని డీవీఎం కాలేజీ సమీపంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 18 పల్సర్‌ బైక్‌లతో పాటు మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాలోని రూ.22 వేల నగదును ఫ్రీజ్‌ చేశారు.

Election 2024

మరిన్ని వార్తలు