అక్రమాలు బయట పడేనా? | Sakshi
Sakshi News home page

అక్రమాలు బయట పడేనా?

Published Mon, Apr 8 2024 8:15 AM

కొనుగోలు చేసిన వాహనాలు  - Sakshi

తుర్కయంజాల్‌: పురపాలక సంఘంలో వాహనాల కొనుగోళ్ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత సంవత్సరం జరిగిన వాహనాల కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలు బయటకు వచ్చేనా అనే చర్చ స్థానికంగా కొనసాగుతోంది. తాజాగా శనివారం ఆర్‌డీఎంఏ శ్రీనివాస్‌ రెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలో వాహనాల కొనుగోలుకు సంబంధించిన రికార్డులను పరిశీలించడం.. విచారణ చేపట్టడంతో ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ‘పూజలు చేశారు..మూలన చేర్చారు’ శీర్షికన ‘సాక్షి’లో 2023 ఆగస్టు 10న కథనం ప్రచురించిన విషయం విధితమే. ఆ తరువాత ఇటీవల మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మల్‌రెడ్డి అనురాధ వాహనాల కొనుగోళ్లపై విచారణ చేపట్టాలని సీడీఎంఏకు లేఖ రాశారు. కౌన్సిల్‌ ప్రమేయం లేకుండా అధికారులు ఇష్టారీతిన వాహనాలు కొన్నారని ఆమె అందులో పేర్కొన్నట్లు సమాచారం.

ఎక్కువ ధర చెల్లించి..

స్వచ్ఛ సర్వేక్షణ్‌–2022లో భాగంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో తుర్కయంజాల్‌కు అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రోత్సాహకంగా రూ. 2 కోట్ల నిధులు కేటాయించింది. ఈ డబ్బుల్లో అధిక శాతం ఎలాగైనా కాజేయాలని అప్పటి కమిషనర్‌, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే వాహనాలను ఎక్కువకు కొనుగోలు చేసినట్లు ఎంబీ రికార్డులు చేయించారు. సూపర్‌ మిషన్‌ పవర్‌ టూల్స్‌ అనే కంపెనీ ద్వారా రూ.22 లక్షలతో కారు, రూ.32 లక్షలతో 2 లోడర్లు, రూ.36 లక్షలతో 3 టాటా ఏస్‌ వాహనాలు, రూ.42 లక్షలతో ప్రొక్లెయినర్‌ను కొనుగోలు చేశారు.

రూ.70 లక్షలు వెచ్చించినా..

పై వాహనాలతోపాటు సుమారు రూ.70 లక్షల వ్యయంతో స్వీపింగ్‌ మిషన్‌ను కొనుగోలు చేశారు. ఈ వాహనాన్ని కూడా 2023 జూలై 7న పాలకవర్గం మొత్తం వాహనాలతో కలిసి ప్రారంభించింది. ఒక గంట కూడా పని చేయకుండానే ఇంజన్‌ నుంచి ఆయిల్‌ లీక్‌ అవుతుండటంతో దాన్ని షెడ్‌కు పంపించారు. తిరిగి తెచ్చిన తర్వాత కూడా ఆ వాహనం రోడ్డు ఊడ్చిన దాఖలాలు లేవు. మరోసారి ఈ ఏడాది ఫిబ్రవరి 7న మధ్యాహ్నం బయటకు తీసేందుకు ప్రయత్నించినా అది కేవలం 100 అడుగుల దూరం వచ్చి సాగర్‌ రహదారిపై మొరాయించింది. దీంతో సదరు వాహనాన్ని సరఫరా చేసిన సూపర్‌ మిషన్‌ పవర్‌ టూల్స్‌ కంపెనీ సిబ్బందికి సమాచారం అందించారు. వారు దాన్ని రిపేర్‌ చేయడానికి ప్రయత్నించినా సఫలం కాకపోవడంతో అదే రోజు తీసుకువెళ్లారు. నేటికీ దాని జాడే లేదు.

ప్రజాధనం దుర్వినియోగం

రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న వాహనాలు నాలుగు కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడకుండా పోతున్నాయి. కమీషన్ల కక్కుర్తి కోసం అంతగా నాణ్యత లేని వాటిని తెచ్చి మున్సిపాలిటీకి అంటగట్టి ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడ్డ అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, డబ్బులు రికవరీ చేయాలని పలువురు కౌన్సిలర్లు, స్థానికులు కోరుతున్నారు. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించి అక్రమాలను బయటకు తీయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వాహనాల కొనుగోళ్లలో చేతివాటం

తక్కువ ధరకు లభించే వాటిని ఎక్కువకు కొనుగోలు

విచారణ నిమిత్తం

సీడీఎంఏకు చైర్‌పర్సన్‌ లేఖ

తాజాగా ఆర్‌డీఎంఏ

రికార్డుల పరిశీలన

తుర్కయంజాల్‌ మున్సిపాలిటీలో వ్యవహారం

విచారణ జరుగుతోంది

వాహనాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరుగుతున్న మాట వాస్తవమే. ఇందులో భాగంగా శనివారం ఆర్‌డీఎంఏ మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి రికార్డులు పరిశీలించారు. దీనిపై కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌ దృష్టి సారించారు.

– బి.సత్యనారాయణ రెడ్డి,

కమిషనర్‌, తుర్కయంజాల్‌

రోడ్డుపై మొరాయించిన స్వీపింగ్‌ మిషన్‌ (ఫైల్‌)
1/2

రోడ్డుపై మొరాయించిన స్వీపింగ్‌ మిషన్‌ (ఫైల్‌)

2/2

Advertisement
Advertisement