జంటపై దౌర్జన్యం.. సుమోటోగా కేసు నమోదు | Sakshi
Sakshi News home page

జంటపై దౌర్జన్యం.. సుమోటోగా కేసు నమోదు

Published Thu, Mar 28 2024 7:05 AM

-

చార్మినార్‌: రంజాన్‌ మార్కెట్‌ సందర్శనకు వచ్చిన ఓ గుర్తుతెలియని కుటుంబంపై మక్కా మసీదు గ్రానైట్‌ రోడ్డులో అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించిన సంఘటనపై సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని చార్మినార్‌ ఇన్‌స్పెక్టర్‌ కమతం చంద్రశేఖర్‌ తెలిపారు. రెండు రోజుల క్రితం ఓ మహిళ తన భర్తతో పాటు చిన్నారిని ఎత్తుకుని రంజాన్‌ మార్కెట్‌ను సందర్శిఽంచింది. మక్కా మసీదు రోడ్డులోని ఫుట్‌పాత్‌ వద్ద కొంత మంది ఆకతాయిలు వీరిని అడ్డుకుని అన్యమతస్తురాలిని ఎందుకు వివాహం చేసుకున్నావని దూషించి దౌర్జన్యానికి దిగారు. తన భర్తను కొట్టవద్దని వెంట ఉన్న భార్య బతిమిలాడినా పోకిరీలు వదిలి పెట్టలేదు. అందరూ చూస్తుండగా ఈ దౌర్జన్యం కొనసాగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వెంటనే స్పందించిన దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు చార్మినార్‌ పోలీసులు సుమోటో కేసు నమోదు చేసుకుని సాంకేతిక ఆధారాలతో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఎలాంటి ఫిర్యాదు లేనప్పటికీ..4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను గుర్తించినట్లు సమాచారం.

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని..

భార్యను కొట్టి చంపిన భర్త

జియాగూడ: మద్యం తాగేందుకు డబ్బులు కావాలంటూ భార్యతో గొడవపడి విచక్షణ రహితంగా కొట్టడంతో ఆమె మృతిచెందిన సంఘటన కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రామస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పన్నిపురా గుల్షన్‌ రసూల్‌ కాలనీలో అస్మా ఫాతిమా, సయ్యద్‌ అబ్దుల్‌ సలీమ్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు సంతానం. సయ్యద్‌ అబ్దుల్‌ సలీమ్‌ సెంట్రింగ్‌ పని చేసేవాడు. మద్యానికి బానిసైన అతను డబ్బుల కోసం తరచూ భార్యపై దాడి చేసేవాడు. మంగళవారం రాత్రి సలీమ్‌ మద్యం తాగేందుకు డబ్బులు కావాలని భార్యతో గొడవకు దిగాడు. అస్మా ఫాతిమా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి లోనైన అతను ఆమెను తీవ్రంగా కొట్టడమేగాక గోడకు తోసివేయడంతో అస్మా ఫాతిమా అపస్మారక స్థితికి చేరుకుంది. పక్క ఇంట్లో ఉంటున్న ఆమె సోదరి రిజ్వానా ఫాతిమాను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. బుధవారం మధ్యాహ్నం అస్మా ఫాతిమా సోదరుడు సయ్యద్‌ అంజాద్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఫొటో జర్నలిస్టులపై దాడులు అనైతికం

హిమాయత్‌నగర్‌: విధి నిర్వహణలో ఉన్న ఫొటో జర్నలిస్టులపై దాడి పత్రికా స్వేచ్ఛపై దాడి అని రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్‌, ప్రధాన కార్యదర్శి కె.ఎన్‌.హరి అన్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీ వీధుల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యకర్తలు చేస్తున్న నిరసనలను కవర్‌ చేసేందుకు వెళ్లిన ఫొటో జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసులు అకారణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడం అమానుషమన్నారు. దీనిని తెలంగాణ రాష్ట్ర ఫొటోజర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం దేశోద్ధారక భవన్‌ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం కోశాధికారి కె.అనిల్‌కుమార్‌, కార్యవర్గ సభ్యులు నక్క శ్రీనివాస్‌, ఎం.డి.అలీముద్దీన్‌ నేతలు జి.బాలస్వామి, సయీద్‌ మజార్‌, ఇ.జనార్దన్‌రెడ్డి, రామకష్ణ, పిప్పళ్ల వెంకటేష్‌, సురేష్‌రెడ్డి, ఇ.నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement