Telangana BJP: బండికి బ్రేక్ ఎందుకు పడింది?

26 Dec, 2022 18:27 IST|Sakshi

తెలంగాణ కమల దళపతి బండి సంజయ్ సంగ్రామ యాత్రకు  బిజేపీ హైకమాండ్ రెడ్ సిగ్నల్ వేసింది. నేల విడిచి సాము చేయవద్దని సూచించింది. 5 వ విడత ముగియగానే 6వ విడత ప్రారంభించాలని అనుకున్న పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. సంస్థాగత అంశాల పై దృష్టి పెట్టాలని హై కమాండ్ ఆదేశించింది. దీంతో పాదయాత్ర ఇప్పట్లో మొదలు అయ్యేలా కనిపించడం లేదు.

బండి వద్దు.. బస్ వద్దు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా అంటూ పాదయాత్ర చేపట్టారు. ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఇప్పటికే 5 విడతలు పూర్తి అయింది. 6వ విడత పాద యాత్ర ఎప్పటి నుండి అనేది 5వ విడత ముగింపు సందర్భంగా బండి సంజయ్ ప్రకటిస్తారు అని పార్టీ నేతలు తెలిపారు. 5వ విడత ముగిసిన వారం లోపే 6వ విడత షురూ అవుతుందని చెప్పారు. అయితే నెక్స్ట్ విడత పాదయాత్ర ఎప్పుడు అనేది ప్రకటించలేదు. గ్రేటర్ పరిధిలో మిగిలిన నియోజక వర్గాల్లో యాత్ర చేస్తారని పార్టీ నేతలు అన్న అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. 6వ విడత 10 రోజుల పాటు చేసి ఆ తర్వాత బస్ యాత్ర చేపడుతారని పార్టీ నేతలు అన్నారు. సంక్రాంతి కి ముందు 6 వ విడత సంక్రాంతి తరవాత బస్ యాత్ర ఉండొచ్చు అని ప్రచారం జరిగింది. సంజయ్ మొదటి టర్మ్ ముగిసే లోపు ఫిబ్రవరి చివరి వరకు బస్ యాత్ర క్లోజ్ అవుతుంది అని... పాద యాత్ర , బస్ యాత్ర ల ద్వారా రాష్ట్రం లోని అన్ని అసెంబ్లీ లను టచ్ చేయడం పూర్తి అవుతుందని అనుకున్నారు.

ఇప్పట్లో వద్దులే.!
బండి సంజయ్ యాత్రలకు తాత్కాలిక బ్రేక్ పడ్డట్టే అని తెలుస్తుంది. పార్టీ హై కమాండ్ అన్ని పక్కన బెట్టి సంస్థాగత నిర్మాణం, బూత్ కమిటీ ల పై దృష్టి పెట్టాలని ఆదేశించింది. మండలాల వారిగా బూత్ కమిటీ ల సమ్మేళనం ఏర్పాటు చేయాలని జనవరి మొదటి వారం లోపు పూర్తి చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇక జనవరి 7 రాష్ట్రం లోని 119 నియోజక వర్గాల్లో బూత్ కమిటీలతో అసెంబ్లీ సదస్సులు నిర్వహించాలని డిసైడ్ అయింది. ఈ సదస్సులనుద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వర్చువల్ గా ప్రసంగించనున్నారు. ఈ నెల 28,29, 30 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల పూర్తి సమయ కార్యకర్తల సమావేశం, తెలంగాణ అసెంబ్లీ కోర్ కమిటీలసమావేశం హైదారాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమాలు ఉండడం తో సంజయ్ పాదయాత్ర సంక్రాంతి ముందు జరిగే అవకాశం లేదు... ఇక సంక్రాంతి తర్వాత కూడా బండి అసెంబ్లీల వారీగా పర్యటించాలని భావిస్తున్నారు. రోజు మూడు అసెంబ్లీల చొప్పున సంస్థాగత అంశాల పై సమీక్ష చేయాలని.. బూత్ కమిటీలను నేరుగా కలవాలని అనుకుంటున్నారు. ఈ కార్యక్రమం పూర్తి అయ్యే సరికి నెల టైమ్ పడుతుంది. సంజయ్ యాత్ర ఇప్పట్లో స్టార్ట్ కాదని స్పష్టం అవుతుంది.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

 

మరిన్ని వార్తలు